AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పులివెందుల ఓటమిని జీర్ణించుకోలేకే జగన్ సవాళ్లు: మంత్రి సత్యకుమార్..

స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ రోజున పులివెందులలోనే ఉంటా, ఎవరోస్తారో రండి చూస్తానంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కడప జిల్లాలో, ముఖ్యంగా పులివెందులలో నామినేషన్ల ప్రక్రియ ముగిసేనాటికి పార్టీ ఎదుర్కొన్న పరాభవాన్ని జీర్ణించుకోలేక, పోలింగ్ నాడు హింసను రెచ్చగొట్టడానికే జగన్ ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

“నామినేషన్ల ప్రక్రియ ముగిసే నాటికి కడపలో సీన్ రివర్స్ అయి తాను, తన పార్టీ ‘పడక’ ఎక్కడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే పోలింగ్ నాడు హింసను రెచ్చగొట్టే దురుద్దేశం ఆయన వ్యాఖ్యలతో స్పష్టమైంది” అని విమర్శించారు. దశాబ్దాలుగా తన కుటుంబం అనుసరించిన హింసా రాజకీయాలనే జగన్ కొనసాగించాలనుకుంటున్నారని, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

“నామినేషన్ల సమయంలో ప్యాలెస్‌కు పరిమితమై, విత్ డ్రాయల్స్ సమయంలో ముఖం చాటేసి, అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు చొక్కా మడతపెట్టడంలో ఆంతర్యం ఏమిటి?” అని సత్యకుమార్ నిలదీశారు. ఎన్నికలను వాయిదా వేయించడానికి జగన్ చేసిన ప్రయత్నాలను సుప్రీంకోర్టు అడ్డుకుందన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా జగన్ తనను తాను సంస్కరించుకుని, ప్రజాస్వామ్యవాదిగా మారే ప్రయత్నం చేయాలని హితవు పలికారు.

ANN TOP 10