తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. కరీంనగర్‌లో పర్యటించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్, బీజేపీ లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు.
బీఆర్ఎస్ అప్పులపై నిలదీత
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ప్రజలంతా గమనిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు తాము లెక్కలు చూపిస్తుంటే.. హరీష్ రావు, కేటీఆర్ భరించలేకపోతున్నారని విమర్శించారు. నిజాలను దాచిపెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినందుకే ప్రజలు బీఆర్ఎస్‌ను గద్దె దించారనే విషయాన్ని వారు మర్చిపోవద్దని హితవు పలికారు. గత ప్రభుత్వం చేయలేని పనులను తాము చేసి చూపిస్తుంటే, ఓర్వలేక ఈర్ష్య పడుతున్నారని మండిపడ్డారు.
కాళేశ్వరంపై ఘాటు విమర్శలు
బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై టీపీసీసీ చీఫ్ తీవ్ర ఆరోపణలు చేశారు. కాళేశ్వరం పేరుతో ఏకంగా రూ. 1.20 లక్షల కోట్లను బూడిదలో పోసిన పన్నీరు చేశారని విమర్శించారు. నాడు పోలీసుల అండతో బీఆర్ఎస్ నాయకులు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే!
మరోవైపు బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలకూ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని బండి సంజయ్ అనడం హాస్యాస్పదమన్నారు. అసలు నిజం ఏంటంటే.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలే లోపాయికారీ ఒప్పందంతో ఒకటయ్యాయని, ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. దేశంలో అదానీ, అంబానీలను తప్ప బీజేపీ ప్రభుత్వం మరెవరినీ అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. దేవుడి పేరు చెప్పి ప్రజలను మోసం చేయవద్దని, జనం ఇప్పుడు నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. తమ జాతీయ అధ్యక్షుడు వస్తే కనీసం 2000 మందిని కూడా సమీకరించుకోలేని సభలు నిర్వహిస్తున్న బీజేపీ.. కాంగ్రెస్ గురించి మాట్లాడటం సరికాదన్నారు.
పార్టీ అంతర్గత విషయాలు, క్యాబినెట్ విస్తరణ
కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువని, ఎవరైనా పరిధి దాటితే వెంటనే సస్పెండ్ చేయడమో, డిస్మిస్ చేయడమో పరిష్కారం కాదని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఏవైనా సమస్యలుంటే అందరం కూర్చొని చర్చించుకుంటామని, కలిసి ముందుకు సాగుతామని చెప్పారు. యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటు విషయంలో స్థానిక నాయకులను సంప్రదించి ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక మంత్రివర్గ విస్తరణపై స్పందిస్తూ.. క్యాబినెట్‌లో కేవలం రెండు ఖాళీలు (అవకాశాలు) మాత్రమే ఉన్నాయని, దీనిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.








