మహారాష్ట్ర సీఎం అపాయింట్ మెంట్ కావాలని తెలంగాణ సీఎం కోరలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. రేవంత్ రెడ్డి కోసం. కిషన్ రెడ్డి ఎందుకు అపాయింట్మెంట్ ఇప్పించాలని ఆయన ప్రశ్నించారు. ప్రజలు రేవంత్ ను సీఎంగా గెలిపిస్తే.. ఆయన పనిని కూడా కిషన్ రెడ్డి చేయాలా? అని నిలదీశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కిషన్ రెడ్డి చిన్నప్పటి నుంచి ఏబీవీపీ, సంఘ్, బీజేపీ పార్టీలోనే అంచెలంచెలుగా ఎదిగారని, రేవంత్ లా పూటకో పార్టీ మారలేదని మండిపడ్డారు. ఇప్పటికే ఎన్నో పార్టీలు తిరిగిన రేవంత్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నీతులు చెబుతారా? అని ప్రశ్నించారు. ఉప్పల్ లో సీఎం రేవంత్ రెడ్డి అబ్దద్దాల చిట్టా విప్పారని మండిపడ్డారు.
హైడ్రా పేరుకు హిట్లర్..
ఆయన నోరు తెరిస్తే అబద్ధమని ఫైరయ్యారు. సీఎం స్థాయిలో ఉండి పచ్చి అబద్ధాలు చెప్పడం తెలంగాణకు అవమానమన్నారు. జీడీపీ పెరుగుతోందని, భారత్ దేశం ముందుకు వెళ్తోందని ప్రపంచ గుర్తించడం కాంగ్రెస్ కు ఏమాత్రం నచ్చడం లేదన్నారు. హైడ్రా పేరుకు హిట్లర్ ఆదర్శమని చెప్పడం శోచనీయమని రాంచందర్ రావు ఫైరయ్యారు. ఎంతోమంది ప్రాణాలు తీసిన హిట్లర్ ఆదర్శమనడం తెలివిలేని పని అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే డిక్టేటర్ షిప్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటేనే నిరంకుశత్వమని, అందుకే ఎమర్జెన్సీ విధించారన్నారు. గాంధీ కుటుంబం సిట్ అంటే సిట్ డౌన్ అంటే డౌన్ చేస్తూ రేవంత్ గులాంగిరీ చేస్తున్నారని రాంచందర్ రావు ఫైరయ్యారు. సూట్ కేస్ తీసుకుని వెళ్ళి ఇటలీ కుటుంబానికి రేవంత్ ఇస్తున్నారని ఆరోపించారు.
రేవంత్ రెడ్డికి బీజేపీ భయం..
బీసీ ప్రధాని, గిరిజన మహిళా ప్రెసిడెంట్ కు రేవంత్ రెడ్డి నమస్తే పెట్టడా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మూడు రాష్ట్రాలకే పరిమితమైందని, ఎందుకంటే హిట్లర్ ఆదర్శంతో ఉండటమే దీనికి కారణమని ఎద్దేవాచేశారు. రేవంత్ రెడ్డికి బీజేపీ భయం పట్టుకుందని చురకలంటించారు. ఊరికే కిషన్ రెడ్డి, బండి సంజయ్ ను టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేయడం సరికాదని రాంచందర్ రావు విమర్శించారు. వరి కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోలు విషయంలో అట్టర్ ఫ్లాప్ అయిందని మండిపడ్డారు. నెల ఆలస్యం చేసి పంట కొనుగోలు చేశారన్నారు. రైతు ఘోష-బీజేపీ భరోసా పోరుబాటతో ప్రభుత్వం దిగొచ్చి పంట కొనుగోలు చేసిందని, అప్పటిదాకా మంత్రులు, ఎమ్మెల్యేలంతా హాయిగా నిద్రపోయారని రాంచందర్ రావు విమర్శించారు.
బీజేపీ వ్యతిరేకం..
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో ఫుల్ అవినీతి పెరిగిపోయిందని రాంచందర్ రావు ఆరోపించారు. ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు.. కేసీఆర్ కు ఏటీఎంగా మారితే.. ఇప్పుడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు రేవంత్ రెడ్డికి ఏటీఎంగా మారుతోందని వ్యాఖ్యానించారు. మూసీ పునరుద్ధరణకు బీజేపీ వ్యతిరేకం కాదని, కానీ పేదల ఇండ్లు కూల్చకుండా చేపట్టాలన్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు విషయంలో ఇండ్లు కోల్పోయే బాధిత కుటుంబాలకు అండగా బీజేపీ ఉంటుందన్నారు. మూసీ పునరుద్ధరణ సీఎం రేవంత్ రెడ్డికి రెండో ఏటీఎం అని, సీఎం, మంత్రులంతా కలిసి పంచుకునే ప్లాన్ లో ఉన్నారని రాంచందర్ రావు ఆరోపించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో సైతం రేవంత్ అబద్ధాలు చెప్పారన్నారు.
కాంగ్రెస్ డిక్లరేషన్..
కర్ణాటక భీమా ప్రాజెక్టుకు కృష్ణ జలాలను తరలిస్తున్నారని, అది ఎవరి జాగీర్ అని నీళ్లు ఇస్తున్నారని ప్రశ్నించారు. కర్ణాటక సీఎం డీకే శివకుమార్.. రేవంత్ కు దోస్త్ కావడంతో పాటు రాహుల్ గాంధీ కోరిక మేరకు కృష్ణ మిగులు జలాలను కర్ణాటకకు ఇస్తున్నారా? అని రాంచందర్ రావు నిలదీశారు. కాంగ్రెస్ డిక్లరేషన్, గ్యారెంటీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా బీజేపీపై పడి ఏడవటం ఆపాలని, బీజేపీ భజన బంద్ చేయాలని సూచించారు. లేదంటే ఇలా భజన చేసి చేసి వారు ఏ పార్టీలో ఉన్నారో కూడా మరిచిపోతారని ఎద్దేవాచేశారు. బీజేపీతో పెట్టుకున్న నేతలంతా ఇంటికే పరిమితమయ్యారన్నారు. ఇండి కూటమిలో ఎవరు ఉంటారో పోతారో తెలీదని, ఇప్పటికే డీఎంకే, ఆప్ దూరమైందని రాంచందర్ రావు తెలిపారు.








