AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణలో వన మహోత్సవం..! ఈ ఏడాది లక్ష్యం ఎంతంటే..?

రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించడమే ధ్యేయంగా ప్రభుత్వం హరిత యజ్ఞానికి తెరలేపింది. ఈ ఏడాది వన మహోత్సవంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 16.06 కోట్ల మొక్కలను నాటాలని సర్కార్‌ లక్ష్యంగా పెట్టుకుంది. వర్షాకాలం ఆరంభం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అటవీ శాఖతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలు సర్వసన్నద్ధమయ్యాయి. ప్రభుత్వ ఖాళీ స్థలాలు, రోడ్ల ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు అటవీ విస్తీర్ణం పెంచి భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం ఇవ్వాలని సర్కార్ భావిస్తోంది.

 

శాఖల వారీగా లక్ష్యాలు

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, ఈసారి కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలను కూడా ప్రభుత్వం పక్కాగా ప్రణాళిక చేసింది. ఇందులో భాగంగానే ఏ శాఖ ఏ మేరకు మొక్కలు నాటాలనే దానిపై ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యాలను (టార్గెట్లను) నిర్దేశించింది. గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం వెల్లివిరిసేలా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో అత్యధికంగా 6.18 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంనిర్దేశించారు. ప్రతి గ్రామంలోని ప్రకృతి వనాలు, రహదారుల ఇరువైపులా ఈ మొక్కలను నాటనున్నారు.

 

7.20 కోట్ల మొక్కలు..

అదే విధంగా హైదరాబాద్‌ మహానగర పరిధిలో కాంక్రీట్ వనాలకు చెక్ పెడుతూ, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ, ఎంఏయూడీ పరిధిలో 7.20 కోట్ల మొక్కలు నాటాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. అర్బన్ పార్కులు, లేఅవుట్లు, ఓపెన్ స్పేస్‌లలో వీటికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అదే విధంగా ఫారెస్టు, టీఎస్ఎఫ్డీసీకి 86లక్షలు, ట్రాన్స్ పోర్టు, ఆర్అండ్‌బీకి 2.7లక్షలు, అగ్రికల్చర్ కు 90లక్షలు, రెవెన్యూ 24లక్షలు, హోంశాఖకు 7.2లక్షలు, విద్యాశాఖకు 4.11లక్షలు, ఫిషరీస్ కు 1.4లక్షలు, పరిశ్రమలశాఖకు 12.6లక్షలు, మైన్స్ శాఖకు 2.5లక్షలు, వైద్యఆరోగ్యశాఖకు 68వేలు, విద్యుత్ శాఖకు 22.5లక్షలు, ఇలా పలుశాఖలకు ప్రభుత్వం మొక్కలు నాటాలని టార్గెట్ విధించింది.

 

నిరంతర నిఘా.. జియో ట్యాగింగ్!

నాటిన ప్రతి మొక్కా బతికేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, కేవలం ఫోటోల కోసం, రికార్డుల కోసం కాకుండా క్షేత్రస్థాయిలో మార్పు కనిపించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు అని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొక్కలు నాటడంతోనే సరిపెట్టకుండా, వాటి మనుగడను పెంచేందుకు ఈసారి అధునాతన సాంకేతికతను వాడుతున్నారు. నాటిన ప్రతి మొక్కను జియో ట్యాగింగ్ చేయనున్నారు. అలాగే, గ్రామాల్లో నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతను స్థానిక సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు, పట్టణాల్లో వార్డు అధికారులకు అప్పగించారు. ఎండకాలంలో కూడా వీటికి నీళ్లు పోసేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించారు. జిల్లాల వారీగా కలెక్టర్లు, స్థానిక సంస్థల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.

 

పండుగలా వన మహోత్సవం

ఈ వన మహోత్సవంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, పాఠశాల విద్యార్థులు మరియు ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. “ప్రతి ఒక్కరూ బాధ్యతగా కనీసం ఒక మొక్క నాటి, దాన్ని రక్షించాలి” అని ప్రభుత్వం పిలుపునిచ్చింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని గుర్రంగూడ అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక వన మహోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల 9 లేదా 10న అధికారికంగా ప్రారంభించబోతున్నారు. అందుకు అర్బన్ పార్కులో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు.

 

మొక్కలు సిద్ధం

 

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,750 గ్రామ పంచాయతీ నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నారు. ఇందులో కమ్యూనిటీ, అవెన్యూ ప్లాంటేషన్లతో పాటు ఈత, తాటి, ఉద్యానవన మొక్కలు, జామ, నిమ్మతో పాటు పలురకాల పండ్ల మొక్కలను సైతం పెంచుతున్నారు. ఇంటింటికీ పంపిణీ చేసేందుకు గ్రామాల్లో ఏర్పాట్లు సైతం చేస్తున్నారు. ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసేందుకు వీలుగా ప్రతి గ్రామంలోనూ, మున్సిపల్ వార్డుల్లోనూ ప్రత్యేక పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఔషధ మొక్కలను కూడా ఈసారి ఎక్కువగా పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. జన భాగస్వామ్యంతోనే ఈ వన మహోత్సవాన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని ప్రభుత్వం పిలుపు మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ANN TOP 10