AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!

భారత టీ20 జట్టు నూతన కెప్టెన్‌గా నియమితుడైన శ్రేయస్ అయ్యర్‌పై సీనియర్ ఆటగాడు, బ్యాటింగ్ దిగ్గజం రోహిత్ శర్మ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశాడు. ఈ కొత్త బాధ్యతలో శ్రేయస్ తప్పకుండా రాణిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. అదే సమయంలో, భవిష్యత్ తరాల క్రికెటర్లను తీర్చిదిద్దడంలో టీ20 ముంబై లీగ్ ఒక ముఖ్యమైన వేదిక అని ప్రశంసించాడు.

 

ముంబైలోని వాంఖడే స్టేడియంలో సోబో ముంబై ఫాల్కన్స్, ట్రయంఫ్ నైట్స్ జట్ల మధ్య జరిగిన టీ20 ముంబై లీగ్ మ్యాచ్ సందర్భంగా రోహిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ 36 బంతుల్లో 61 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి తన జట్టును గెలిపించాడు.

 

ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ, “ముంబై క్రికెట్‌లో ఆడటం ఎన్నో విషయాలు నేర్పుతుంది. ఇక్కడ ఏదీ సులువుగా రాదు. ప్రతిదీ కష్టపడి సంపాదించుకోవాల్సిందే. కెప్టెన్సీ కూడా అలాంటిదే. చుట్టూ ఉన్నవారి గౌరవాన్ని సంపాదించుకోవాలి” అని అన్నాడు.

 

సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్‌ల ప్రయాణాలను ఉదాహరణగా చూపుతూ, “సూర్యను చూడండి, అతను 31 ఏళ్ల వయసులో అరంగేట్రం చేశాడు. అంటే అతను ఎప్పుడూ పట్టు వదల్లేదు. ఇప్పుడు శ్రేయస్ టీ20 కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. గతంలో అతను తన ఫ్రాంచైజీకి, ముంబైకి కెప్టెన్‌గా వ్యవహరించిన తీరు చూస్తే, అతను కూడా మంచి విజయం సాధిస్తాడని నేను కచ్చితంగా చెప్పగలను” అని రోహిత్ తెలిపాడు.

 

ఐపీఎల్‌లో ఆడని చాలా మంది యువ ఆటగాళ్లకు టీ20 ముంబై లీగ్ ఒక గొప్ప వేదిక అని, ఫ్రాంచైజీల యజమానులు ఈ టోర్నీని గమనిస్తారని హిట్ మ్యాన్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ ముగిసిన వెంటనే ఈ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజింక్య నాయక్‌ను, అతని బృందాన్ని రోహిత్ ప్రత్యేకంగా అభినందించాడు.

ANN TOP 10