ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకం ఖరారైంది. కూటమిలోని ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మూడు స్థానాలను తీసుకోనుండగా, జనసేన పార్టీకి ఒక స్థానాన్ని కేటాయించారు. ఈ సర్దుబాటులో బీజేపీకి ఈసారి అవకాశం లభించలేదు.
ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ పాల్గొన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలం ఆధారంగానే ఈ కేటాయింపులు జరిపినట్లు స్పష్టమవుతోంది. అసెంబ్లీలో టీడీపీకి భారీ మెజారిటీ ఉండగా, జనసేనకు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
షెడ్యూల్ ప్రకారం జూన్ 18న నాలుగు రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం వైసీపీకి చెందిన మూడు, టీడీపీకి చెందిన ఒక స్థానం ఖాళీ అవుతున్నాయి. అసెంబ్లీలో ఎన్డీఏ కూటమికి ఉన్న పూర్తి ఆధిక్యతతో ఈ నాలుగు స్థానాలనూ గెలుచుకోవడం లాంఛనప్రాయమే.
మరోవైపు, ఈ పదవుల కోసం టీడీపీ, జనసేన పార్టీలలో తీవ్రమైన పోటీ నెలకొంది. త్వరలోనే అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని కూటమి వర్గాలు తెలిపాయి.








