దేశంలో రాజకీయాలు రూటు మార్చాయి. పార్టీని నమ్ముకున్న నేతలు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి మిగతా పార్టీల నేతలు వలస పోతున్నాయి. జాతీయ పార్టీలే కాదు ప్రాంతీయ పార్టీలదీ అదే దారి. మొన్నటివరకు బలంగా కనిపించిన బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్, అధికారం పోయిన తర్వాత అంతర్గత కలహాలు మొదలయ్యాయి.
తారాస్థాయికి చేరిన టీఎంసీలో సంక్షోభం
ఆ పార్టీలోని అసంతృప్తులు వ్యతిరేక జెండా ఎగురవేయడం మొదలుపెట్టారు. తాజాగా ఆ పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు బీజేపీ హైకమాండ్ పెద్దలతో టచ్‌లోకి వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తొలిసారి అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి తర్వాత మొదలైన అసమ్మతి తారాస్థాయికి వెళ్లింది.
ఈ సంక్షోభం బెంగాల్‌కు పరిమితం కాలేదు. చివరకు హస్తిన వరకు పాకింది. 20 మంది ఎంపీలు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు అధినేత్రి మమతాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జూన్ 3న ఆ పార్టీ బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ స్పీకర్ గుర్తించారు.
బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు
58 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ రెబల్ వర్గం చేసిన ప్రకటన అల్లకల్లోలానికి దారి తీసింది. 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేల్లో ఎక్కువమంది ఎమ్మెల్యేలు రెబల్ వర్గం వైపు మొగ్గుచూపారు. ఈ సంక్షోభం వెనుక మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అసలు కారణంగా తెలుస్తోంది. ఆయన వ్యవహార శైలి వల్ల పార్టీ ఎన్నికల్లో ఓటమి పాలైందని ఆ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు.
ఆయన పెత్తనం చెలాయించడమే తిరుగుబాటుకు కారణమని చెబుతున్నారు. మమతా బెనర్జీ నాయకత్వాన్ని గౌరవిస్తామని అభిషేక్ పెత్తనాన్ని ఏమాత్రం సహించబోమని తేల్చిచెబుతున్నారు. ఆ పార్టీకి చెందిన 20 మంది టీఎంసీ ఎంపీలు బీజేపీ నాయకత్వంలో సంప్రదింపులు జరుపుతున్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఒకవేళ నిజమైతే పార్లమెంటులో ఆ పార్టీ బలం క్షీణించనుంది. రెండురోజుల కిందట మమత నిర్వహించిన కార్యక్రమానికి కేవలం 6 ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు హాజరు కావడం అనేక అనుమానాలు మొదలయ్యాయి. నేతల తిరుగుబాటు నేపథ్యంలో టీఎంసీ పార్టీలోని అన్ని కమిటీలను రద్దు చేసింది అధినేత్రి మమతా. మరి ఆ పార్టీలో సంక్షోభం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.








