AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జనసేన పార్టీ తెలంగాణ నవ నిర్మాణ సభ మాటేంటి..?

జనసేన పార్టీ తెలంగాణ నవ నిర్మాణ సభ మాటేంటి? పర్మిషన్ కోసం మంగళవారం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుందా? న్యాయస్థానం అనుమతి ఇచ్చినా, అప్పటికప్పుడు సభ ఏర్పాట్లు జరుగుతాయా? ఇంతకీ సభ ఉన్నట్టా? లేనట్టా? ఇవే ప్రశ్నలు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలను వెంటాడుతున్నాయి.

 

హైకోర్టులో జనసేన హౌస్ మోషన్ పిటిషన్

 

తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్‌లో జనసేన పార్టీ తెలంగాణ నవనిర్మాణ సభ ఏర్పాటు చేస్తోంది. న్యాయస్థానం సమయం ముగిసిన తరవాత పలు రకాల కారణాలు చూపుతూ పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో సోమవారం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం కుదరలేదని జనసేన పార్టీ తెలిపింది.

 

మంగళవారం ఉదయం జనసేన పార్టీ సభ నిర్వహణ కోసం తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు తెలిపింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టబద్ధంగా, శాంతియుతంగా సభలు నిర్వహించుకునే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉందని పేర్కొంది. రాజ్యాంగబద్ధ హక్కుతో జనసేన పార్టీ తెలంగాణ నవనిర్మాణ సభను నిర్వహించేందుకు అన్ని చట్టపరమైన మార్గాలను అనుసరిస్తోందని ఎక్స్ వేదికగా పేర్కొంది.

 

ఆ వార్తలను నమ్మవద్దని అభిమానులకు, కార్యకర్తలకు విజ్ఞప్తి

 

అదే సమయంలో మీడియా, సోషల్ మీడియాలో రకరకాల వార్తలు రావడంపై రియాక్ట్ అయ్యింది. జనసేన లీగల్ సెల్ తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిందని, న్యాయస్థానం తిరస్కరించిందంటూ వచ్చిన వార్తలను ఆ పార్టీ ఖండించింది.

 

సభకు అనుమతి లభించలేదని ప్రచారం చేస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, కొన్ని మీడియా సంస్థలు, వెబ్ ఛానల్స్ పూర్తిగా అవాస్తవ కథనాలను ప్రచారం చేస్తున్నాయని వెల్లడించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ మొదలుకుని ఎన్నో రాజకీయ పార్టీలు మంగళవారం సభలు నిర్వహించుకుంటారని, వారికి లేని అడ్డంకులు జనసేన పార్టీకి సృష్టించడం శోచనీయమని పేర్కొంది.

 

తెలంగాణ ఆట, పాట, సంస్కృతిని అభిమానించే వ్యక్తి అధినేత పవన్, తెలంగాణ పోరాట స్పూర్తి తనకు ప్రజా సమస్యలపై పోరాటం చెయ్యడానికి ప్రేరణ అని ఆయనే స్వయంగా చెప్పారని రాసుకొచ్చింది. తనని ఆదరించిన తెలంగాణ ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలిపింది.

 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభదినంగా భావించి తలపెట్టిన సభ తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు అనుమతి నిరాకరించడం విచారకరమన్నారు. ఒకవేళ న్యాయస్థానం సభకు అనుమతి ఇచ్చినా, నేతలు, కార్యకర్తలు రావడం కష్టమేనన్న వాదన లేకపోలేదు. ఒకవేళ న్యాయస్థానం అనుమతి ఇస్తే.. సభకు ఐదు నుంచి ఏడు గంటల మధ్య జరిగే అవకాశం ఉందని ఆ పార్టీ నేతల మాట.

ANN TOP 10