తాము అధికారంలో రాగానే ఆంధ్రా నాయకుల విగ్రహాలు పగలకొట్టి.. పార్శిల్ పంపిస్తామని టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత అన్నారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ రాష్ట్ర సేన కార్యాలయంలో ‘తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు – సాధన’ పేరుతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఏపీ పాలకులపై నిప్పులు చెరిగారు. తమ అస్తిత్వంపై దాడి చేస్తూ వారి సంస్కృతిని రుద్దుతామంటే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. టీఆర్ఎస్ 2.0తో పెట్టుకుంటే మూతి పళ్లు రాలతాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పవన్‌కు చురకలు
ఆంధ్రాలో రాజధాని కట్టటం చేతకాకే ప్రస్తుతం తెలంగాణ పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రా రాజకీయ నాయకుల ఏజెంట్ తెలంగాణ సీఎంగా ఉండటంతో వారి డ్రామాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్.. ముందు తమ సెక్రటేరియేట్ లోకి నీళ్లు రాకుండా చూసుకోవాలని కవిత సూచించారు. ఆ తర్వాత తెలంగాణలో జనసేన సభ పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. అటు తెలంగాణలో టీడీపీని విస్తరిస్తామని మహానాడులో లోకేశ్ ప్రకటించడాన్ని సైతం కవిత తప్పుపట్టారు. ఇదేమి మీ బాబు సామ్రాజ్యం కాదంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ అస్థిత్వంపై దాడి
ఆంధ్రా పార్టీలకు ఇక్కడి ప్రజలు ఓట్లు వేయకపోవటంతోనే దుకాణం బంద్ పెట్టుకున్నది మర్చిపోయారా? అంటూ కవిత నిలదీశారు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆంధ్రావాళ్ల విగ్రహాలు పెడుతున్నారని.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని కవిత అన్నారు. దానికి కారణం ఆంధ్రా రాజకీయ నాయకుల ఏజెంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఉండటమని పేర్కొన్నారు. ఇదేదో యాధృచ్ఛికంగా జరుగుతుంది కాదని.. ఒక కుట్ర ప్రకారం మన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ‘ఉద్యమకారుల కోసం పెట్టుకున్న సభలో ఆంధ్రా వాళ్ల గురించి మాట్లాడుతున్నానని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు మన అస్తిత్వం మీద దాడి చేసే ప్రయత్నం జరుగుతోంది. ఆ కుట్రలను నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఉంది’ అని కవిత పేర్కొన్నారు.
‘రాజధాని కట్టుకోలేకపోయారు’
ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి దాదాపు 13 ఏళ్లు అవుతున్న వాళ్లు రాజధాని కట్టుకోలేకపోయారని కవిత విమర్శించారు. తెలంగాణతో కలిసినప్పుడు కూడా మన రాజధాని మీద కన్నేసి.. ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయని కలుపుకున్నారని ఆరోపించారు. కానీ ఇప్పుడు 13 ఏళ్లు అయిన సరే అక్కడ అధికారంలోకి వచ్చిన రెండు పార్టీలు రాజధాని కట్టలేదని ఎద్దేవా చేశారు. ఏపీలో ఇప్పుడు ఉన్న తెలుగుదేశం, జనసేన సంకీర్ణ ప్రభుత్వం పార్లమెంట్ లో వాళ్ల రాజధాని మీద తీర్మానం చేయించుకున్నారని గుర్తుచేశారు. ‘ఎవరైనా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయించుకుంటారు. కానీ వీళ్లు మాత్రం పార్లమెంట్ లో తీర్మానం చేయించుకున్నారు’ అని కవిత సెటైర్లు వేశారు.
‘మహానాడులో పిచ్చి వాగుడు వాగారు’
అమరావతి రాజధాని అంటే జగన్ మాత్రం మావిగన్ పేరుతో వారిపై రాజకీయ బాంబు వేశారని కవిత పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం విషయంలో సంకీర్ణ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని ఆరోపించారు. ఈ సమయంలో ఆంధ్రా ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేసే ప్రయత్నం మొదలు పెట్టారని పేర్కొన్నారు. అందులో భాగంగా మహానాడులో మన మీద పిచ్చి వాగుడు వాగారని వ్యాఖ్యానించారు. తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదంటూ మన వాళ్ల చేతనే అనిపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ డిక్షనరీలో ఉంటే ఎంత? లేకుంటే ఎంత? మీతో మాకు ఏం అవసరం? అని ప్రశ్నించారు.
‘ఆంధ్రుల విగ్రహాలు పార్సిల్ చేస్తాం’
ఆంధ్రా నాయకులకు ఏమైనా అయ్యిందంటే హైదరాబాద్ కు వచ్చి వైద్యం చేయించుకుంటారని కవిత అన్నారు. కానీ ఆంధ్రాలో మాత్రం హాస్పిటల్స్ కట్టటం లేదని విమర్శించారు. నెల్లూరు వాళ్లు చెన్నైయ్ కి, అనంతపురం వాళ్లు బెంగళూరుకు, విజయవాడ వాళ్లు హైదరాబాద్ కు వైద్యం కోసం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని కవిత గుర్తుచేశారు. ఇప్పటికీ కూడా మీ ప్రజలకు మీరు ఎందుకు వసతులు ఇవ్వటం లేదు? అని ఏపీ పాలకులను కవిత నిలదీశారు. ‘నేను అసలే మొండిదాన్ని, మీరు అనుకున్నంతా మంచిదాన్ని కాదు. మేము అధికారంలోకి రాగానే ఇక్కడున్న ఆంధ్రా నాయకుల విగ్రహాలు పగలగొట్టి ఆంధ్రాకు పార్సల్ పంపుతా’ అంటూ హెచ్చరించారు.
సీఎంకి కవిత కీలక సూచన
మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే రెండున్నరేళ్లు గడిచినా.. ఇప్పటికీ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చలేదని కవిత విమర్శించారు. కేకే, పీకే కమిటీలు అంటూ కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన రేపు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నేరవేరుస్తామని ముఖ్యమంత్రి ప్రకటించాలని పట్టుబట్టారు. కోదండరాం లాంటి ఒకరిద్దరికీ లాభం జరిగితే సరిపోదని.. ఉద్యమకారులకు న్యాయం జరిగేలా కాంగ్రెస్ నేతలు కృషి చేయాలని అన్నారు. మరోవైపు తెలంగాణ హక్కులు, అస్తిత్వ పరిరక్షణకు తమ టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుందని కవిత అన్నారు.








