AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వినుకొండలో రూ.1500 కోట్ల భూకుంభకోణం.. నిజాలు ఇవే- ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు..

వినుకొండ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు (ఎమ్మెల్యే) జీవీ ఆంజనేయులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, స్థానిక నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వైసిపి కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు.

 

నంద్యాల ఘటన వెనుక వైసిపి హస్తం

 

నంద్యాలలో వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన వెనుక వైసిపి నాయకులే ఉన్నారని ఆంజనేయులు స్పష్టం చేశారు. కావాలనే ఈ విధ్వంసానికి ఒడిగట్టి, రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు వారు తెరలేపారని విమర్శించారు. కులాలు, వర్గాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందడమే జగన్ మోహన్ రెడ్డి ప్రధాన ఎజెండా అని దుయ్యబట్టారు.

 

వినుకొండలో రూ.1500 కోట్ల భూకుంభకోణం

 

వినుకొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు భారీ అక్రమాలకు పాల్పడ్డారని జీవీ ఆంజనేయులు ఆరోపించారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిని కొల్లగొట్టేందుకు ఫోర్జరీ (దొంగ) జీవోలను సృష్టించారని, తద్వారా సుమారు రూ. 1500 కోట్ల ప్రజాధనాన్ని దోచుకునేందుకు కుట్ర పన్నారని తెలిపారు. ఈ బండారం బయటపడటంతోనే ఆయన పరారయ్యారని పేర్కొన్నారు.

 

బ్రాహ్మణపల్లి భూముల్లో జగన్ వాటా ఎంత?

 

బ్రాహ్మణపల్లి పంచాయతీ పరిధిలోని రెండెకరాల భూమిని కూడా వైసిపి నేతలు అక్రమంగా ఆక్రమించారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ దోపిడీ సొమ్ములో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాటా ఎంతో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. టిడిపిలో ఇలాంటి అక్రమాలకు పాల్పడితే తక్షణమే బహిష్కరిస్తారని, కానీ వైసిపిలో అవినీతికి అండగా నిలుస్తారని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వ అభివృద్ధిని చూసి ఓర్వలేకే జగన్ విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ANN TOP 10