ఉత్తరాంధ్రవాసుల దశాబ్దాల నాటి కల నెరవేరింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు నేటి(జూన్ ఒకటి) నుంచి ప్రారంభమయ్యాయి. సిరిపురం జంక్షన్‌లో ఉన్న డెక్ భవనంలో దక్షిణ కోస్తా రైల్వే ఆఫీసును ఏర్పాటు చేశారు అధికారులు. అక్కడి నుంచి అధికారిక కార్యక్రమాలు మొదలయ్యాయి.
దశాబ్దాల నాటి ఉత్తరాంధ్రవాసుల కల నెరవేరింది
ఏపీవాసుల చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. జూన్ ఒకటి అనగా నేటి నుంచి దక్షిణ కోస్తా రైల్వేజోన్ పట్టాల కెక్కింది. విశాఖపట్నం కేంద్రంగా జోన్ కార్యక్రమాలు సోమవారం నుంచి మొదలయ్యాయి. దీంతో 130 ఏళ్ల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ కనుమరుగు అయ్యింది. సిటీలోని వీఎంఆర్‌డీఏ డెక్ భవనంలో తాత్కాలిక జోనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
ఇకపై జోన్‌కు సంబంధించిన మెకానికల్, టెలి కమ్యూనికేషన్, సివిల్, పరిపాలన వ్యవహారాలు ఈ ఆఫీసు నుంచి కొనసాగనున్నాయి. ఈ జోన్ కింద గుంతకల్లు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం నాలుగు డివిజన్లతో పని చేయనుంది. ఇక దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన ఆఫీసులో జీఎంతోపాటు వివిధ శాఖలకు చెందిన హెచ్ఓడీ కార్యాలయాలు ఏర్పాటు చేశారు.
దశాబ్దాల విశాఖ వాసుల కల నెరవేర్చిన ప్రధాని మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవులకు కృతజ్ఞతలు తెలిపారు సీఎం చంద్రబాబు. ఈ మేరకు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. విశాఖ వేదికగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభంతో ఏపీ పారిశ్రామిక అభివృద్ధితోపాటు లాజిస్టిక్స్ హబ్‌గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు తాత్కాలిక కార్యాలయాల్లో ప్రారంభాన్ని సింపుల్‌గా అధికారుల సమక్షంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాయగడ డివిజన్ విషయంలో కొన్ని సందేహాలు ఉన్నప్పటికీ ఎలాంటి హడావుడి లేకుండా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు సాఫీగా నేటి నుంచి జరగనున్నాయి.
కొత్త జోన్ ద్వారా నిర్వహణ సామర్థ్యం మెరుగుపడుతుంది. రైలులో ప్రయాణికుల సేవలు బలోపేతం కానున్నాయి. సరుకు రవాణా పెరగడం, ఈ ప్రాంతమంతా రైల్వే మౌలిక సదుపాయాలు, సామర్థ్య విస్తరణ ప్రాజెక్టుల అమలు వేగవంతం కాబోతోంది. కొత్త జోన్‌లో దాదాపు 17,000 మంది ఉద్యోగులు ఉండనున్నారు. రద్దీ సమయాల్లో 500కు పైగా రైళ్లు, 800కు పైగా గూడ్స్ రైళ్లను నిర్వహించగలదని ఓ అంచనా. ప్రధాన ఓడరేవులకు సరుకు రవాణా, మల్టీమోడల్ లాజిస్టిక్స్‌ను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.









