AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఉత్తరాఖండ్ ఘోర విషాదం..! హెలికాప్టర్ కూలి ఆరుగురి మృతి..

ఉత్తరాఖండ్‌లో శుక్రవారం ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకోవడం తెలిసిందే. ఈ దుర్ఘటన విషాదాంతంగా ముగిసింది. బద్రీనాథ్ నుంచి సహస్త్రధార వెళుతున్న ఓ ప్రైవేట్ హెలికాప్టర్ జోషిమఠ్ సమీపంలోని చాయ్ గ్రామ సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్‌తో సహా హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద వార్త అందిన వెంటనే ఉత్తరాఖండ్ పోలీస్, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF), ఆర్మీ బృందాలు సంయుక్తంగా రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.

అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, మృతుల్లో హెలికాప్టర్ పైలట్ కెప్టెన్ హిమాన్షు సభర్వాల్ (ఢిల్లీ) కాగా, ప్రయాణికులను ప్రతాప, అరుణ్, శంకర్ గౌడ, సుధీర్ కె, హెచ్.ఎస్. నటరాజాగా గుర్తించారు. వీరంతా కర్ణాటకకు చెందినవారని పోలీసులు తెలిపారు. ప్రమాద స్థలం నుంచి ఆరుగురి మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు ధ్రువీకరించారు. మృతదేహాలను రోడ్డు మార్గం ఉన్న ప్రాంతానికి తరలించే పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

రెండు నిమిషాల్లోనే తెగిన సంబంధాలు

చమోలీ ఎస్పీ సుర్జీత్ సింగ్ పన్వార్ వెల్లడించిన వివరాల ప్రకారం, “ట్రాన్స్ భారత్ ఏవియేషన్” సంస్థకు చెందిన ఈ హెలికాప్టర్ మధ్యాహ్నం 1.12 గంటలకు బద్రీనాథ్ సివిల్ హెలిప్యాడ్ నుంచి బయలుదేరింది. కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే, మధ్యాహ్నం 1.14 గంటల సమయంలో జోషిమఠ్ సమీపంలో హెలికాప్టర్‌తో సంబంధాలు తెగిపోయాయి. హెలికాప్టర్ గాల్లో ఉండగానే అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లడం చూశామని సమీప ప్రాంతాల్లోని స్థానికులు తెలిపారని ఆయన వివరించారు. ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్‌మెంట్ అథారిటీ (UCDA) కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. హెలికాప్టర్‌తో కమ్యూనికేషన్ తెగిపోవడంతో పాటు, ట్రాకింగ్ సిస్టమ్ నుంచి కూడా అది అదృశ్యమైనట్లు తెలిపింది.

సంస్థ సేవలు నిలిపివేత

ఈ దుర్ఘటన నేపథ్యంలో, ముందుజాగ్రత్త చర్యగా ట్రాన్స్ భారత్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన అన్ని హెలికాప్టర్ల సేవలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు యూసీడీఏ ప్రకటించింది. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హెలికాప్టర్ ప్రమాదాలపై ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత హరీశ్ రావత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “ఇది చాలా బాధాకరమైన విషయం. రాష్ట్రంలో హెలికాప్టర్ సేవలను సురక్షితంగా మార్చాల్సిన అవసరం ఉంది. వరుసగా ఇలాంటి సంఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, తగిన మార్పులు చేయాలి” అని ఆయన డిమాండ్ చేశారు.

ANN TOP 10