తెలంగాణ వ్యవసాయ రంగంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్రానికి చెందిన, భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) పొందిన ప్రసిద్ధ తాండూరు కందిపప్పు తొలిసారిగా ఆస్ట్రేలియాకు ఎగుమతి అయింది. మొత్తం 2.5 మెట్రిక్ టన్నుల పప్పుతో కూడిన మొదటి కన్సైన్మెంట్ను తాజాగా ఆస్ట్రేలియాకు పంపించారు. ఈ పరిణామం తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ప్రాధాన్యతను, డిమాండ్‌ను చాటుతోంది.
ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. “భారత జీఐ ఉత్పత్తులు ప్రపంచాన్ని గెలుస్తున్నాయి!” అంటూ ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎగుమతి ద్వారా భారతీయ రుచులు ఆస్ట్రేలియాలోని ఇళ్లకు చేరుతాయని, ప్రామాణికమైన భారత వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడం వల్ల రైతులు, ఎగుమతిదారులు ప్రయోజనం పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఎగుమతితో తాండూరు కందిపప్పుకు సరికొత్త విదేశీ మార్కెట్ ద్వారాలు తెరుచుకున్నాయని అధికారులు తెలిపారు.
తాండూరు కందిపప్పుకు 2022 డిసెంబర్లో భౌగోళిక గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. తెలంగాణ నుంచి జీఐ ట్యాగ్ పొందిన తొలి పప్పుధాన్యపు పంట ఇదే కావడం విశేషం. ఈ గుర్తింపు వల్ల ఈ ఉత్పత్తికి చట్టపరమైన రక్షణ లభించడంతో పాటు ఇతర ప్రాంతాల్లో పండే కందిపప్పుతో పోలిస్తే తాండూరు పప్పు ప్రత్యేకతను ఇది అధికారికంగా తెలియజేస్తుంది. ఈ ట్యాగ్ లభించిన తర్వాత విదేశాలకు ఎగుమతి కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
తాండూరు కందిపప్పును ప్రధానంగా వికారాబాద్ జిల్లాలోని తాండూరు మండలం, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పండిస్తారు. ఈ ప్రాంతంలోని లోతైన నల్లరేగడి నేలలు ఈ పంటకు అత్యంత అనుకూలంగా ఉంటాయి. వర్షాధార పంట అయిన తాండూరు కందిపప్పులో ప్రొటీన్ శాతం అధికంగా ఉండటంతో దీనికి మంచి డిమాండ్ ఉంది. ప్రత్యేకమైన రుచి, త్వరగా ఉడకడం వంటి లక్షణాల వల్ల దీనికి మార్కెట్లో మంచి పేరుంది. తాజా ఎగుమతితో స్థానిక రైతులు, ఎగుమతిదారులకు ఆర్థికంగా మరింత మద్దతు లభించనుంది.






