కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలతోపాటు కొత్త పథకాల అమలుకు శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ మంత్రి అన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఉదయాదిత్య భవన్ లో నిర్వహించిన నియోజకవర్గస్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. 99 రోజుల ప్రణాళికలో అన్ని స్థాయిల్లో సమీక్షలు చేపట్టి సమస్యల పరిష్కారంతోపాటు అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రాథమిక విద్య నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వపరంగా మధ్యాహ్నం భోజనం అందించనుందని చెప్పారు.
నల్గొండ పట్టణంలో..
ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని రూ. 1400 కోట్లతో అమలు చేయనుందన్నారు. అదే విధంగా రామగిరి టెంపుల్ నుంచి దేవరకొండ రోడ్డు వరకు రూ. 15 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. నల్గొండ పట్టణంలో 740 మందికి ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చినట్లు తెలిపారు. జూన్ నుంచి మరో విడత ఇందిర ఇళ్లకు అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ ఉంది. ధాన్యం కొనుగోలులో భాగంగా రైతులకు చెల్లింపులు వేగంగా జరుగుతున్నాయని…దిగుమతుల్లో జాప్యం లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
5 వేల మందికి ఉద్యోగ అవకాశాల కల్పన..
నల్గొండ జిల్లా కేంద్రంలోని న్యాక్ కేంద్రంలో శనివారం 124 కంపెనీలతో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను మంత్రి ప్రారంభించారు. సుమారు 5 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళాను నిర్వహించినట్లు చెప్పారు. ప్రభుత్వం నిరుద్యోగులకు నోటిఫికేషన్ విడుదల చేస్తుండగా మరోవైపు అన్ని జిల్లా కేంద్రాల్లో జాబ్ మేళాలను నిర్వహిస్తూ యువతకు భరోసాగా నిలుస్తున్నట్లు చెప్పారు. నల్గొండ జిల్లాలో రైస్ ఇండస్ట్రీస్, సిమెంటు ఫార్మ పరిశ్రమలలో లోకల్ యువతకే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈనెల 2వ తారీఖున మొదలైన జాబ్ మేళా ఈనెల 3న ఆదివారం కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించారు.
ఫార్మా కంపెనీలు నిబంధన ప్రకారం..
ఉద్యోగం ఎంత చిన్నదైనా జాబ్ లో చేరితే ఉద్యోగపరంగా అనుభవంతో పాటు ఆర్థిక లావాదేవీలపై అవగాహన పెరుగుతుందన్నారు. చదువు పూర్తి కాగానే ఉద్యోగాలను చేరేందుకు యువత ఆసక్తి చూపాలన్నారు. ఫార్మా కంపెనీలు నిబంధన ప్రకారం నడిపిస్తూ ప్రమాదాలను జరగకుండా చూసుకోవాలన్నారు. కంపెనీల నిర్వహణను నిర్లక్ష్యం చేసి ప్రమాదాలు జరిగితే కంపెనీల లైసెన్స్ రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, నల్గొండ మున్సిపల్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి తదితరులున్నారు.








