మాజీ మంత్రి విడదల రజిని ఇటీవల కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరావతి అభివృద్ధి పేరుతో ప్రజల సొమ్మును వృధా చేస్తున్నారని, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని ఆమె ఆరోపించారు.
అమరావతిపై ప్రేమ.. ప్రజలపై నిర్లక్ష్యం
చంద్రబాబుకు అమరావతిలోని అద్దాల మేడలపై ఉన్న మక్కువ, సామాన్య ప్రజల ఆరోగ్యం , విద్యపై లేదని రజిని విమర్శించారు. కేవలం అమరావతి అద్దాల కోసమే రూ. 2,500 కోట్లు ఖర్చు చేయడం దారుణమని, ఆ నిధులను మెడికల్ కాలేజీలకు లేదా ఆరోగ్యశ్రీకి మళ్లించి ఉంటే ఎంతో మందికి మేలు జరిగేదని ఆమె అభిప్రాయపడ్డారు. అమరావతిలో నిర్మాణాల పేరుతో భారీ దోపిడీ జరుగుతోందని, అడుగుకు రూ. 18,500 పైగా ఖర్చు చూపడం అవినీతికి పరాకాష్ట అని ఆమె ధ్వజమెత్తారు.
పెన్షన్ల కోత
గత రెండేళ్లలో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వకపోగా, సుమారు 6 లక్షల పెన్షన్లను అన్యాయంగా తొలగించారని రజిని ఆరోపించారు. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ సానుభూతిపరులను లక్ష్యంగా చేసుకుని పెన్షన్లు కట్ చేస్తున్నారని, 50 ఏళ్లు దాటిన వారందరికీ పెన్షన్ ఇస్తామన్న హామీని గాలికి వదిలేశారని విమర్శించారు. పబ్లిసిటీ కోసం కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, పేదల సంక్షేమం దగ్గరకు వచ్చేసరికి నిధులు లేవని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు.
ఆరోగ్యశ్రీ నిర్వీర్యం
ఆరోగ్యశ్రీ బకాయిలు రూ. 4,000 కోట్లకు చేరాయని, నెట్‌వర్క్ ఆసుపత్రులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే స్థితికి ప్రభుత్వం దిగజారిందని రజిని మండిపడ్డారు. జగన్ పాలనలో ప్రతి వర్గానికి మేలు జరిగిందని, కానీ నేడు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రజల సొమ్ముతో విమానాలు, హెలికాప్టర్లలో విలాసాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ అని, ఎన్టీఆర్ నుంచి రంగా వరకు జరిగిన ఘటనలు ప్రజలకు ఇంకా గుర్తున్నాయని ఆమె వ్యాఖ్యానించారు.








