AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇరాన్‌లోని భారత పౌరులకు కేంద్రం ఎమర్జెన్సీ అలర్ట్..

ఈ రాత్రి తాము చేయబోయే దాడులతో ఓ నాగరికత ముగిసిపోతుందని, ఈ రాత్రి ప్రపంచ చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచిపోతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు తీవ్ర హెచ్చరిక జారీ చేయడం పట్ల భారత కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరాన్‌లో నివసిస్తున్న భారత పౌరుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర హెచ్చరికలను జారీ చేసింది. రాబోయే 48 గంటల పాటు భారతీయులందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడివారు అక్కడే ఇళ్లకు పరిమితం కావాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన డెడ్‌లైన్ సమీపిస్తుండటంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఈ హెచ్చరికలను భారతీయులందరూ తక్షణం పాటించాలని ప్రభుత్వం కోరింది.

 

రాయబార కార్యాలయం జారీ చేసిన సలహాలో పలు కీలకమైన సూచనలు ఉన్నాయి. “తదుపరి 48 గంటల పాటు మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి. అనవసరంగా బయటకు రావద్దు. ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, సైనిక స్థావరాలు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి సున్నితమైన ప్రాంతాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. బహుళ అంతస్తుల భవనాల్లో నివసించే వారు పై అంతస్తుల్లో ఉండవద్దు” అని స్పష్టం చేసింది.

 

అత్యవసరంగా రహదారి ప్రయాణాలు చేయాల్సి వస్తే, తప్పనిసరిగా రాయబార కార్యాలయ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే ఎంబసీ ఏర్పాటు చేసిన వసతి గృహాలు, హోటళ్లలో ఉన్నవారు తమ గదులను విడిచి బయటకు వెళ్లవద్దని, అధికారులతో నిరంతరం టచ్‌లో ఉండాలని కోరింది.

 

హర్మూజ్‌ జలసంధిని తిరిగి తెరవాలని లేదా ఒప్పందానికి రావాలని, లేనిపక్షంలో ఏప్రిల్ 7-8 తేదీల్లోగా ఇరాన్‌లోని విద్యుత్ ప్లాంట్లు, వంతెనలపై తీవ్ర దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ రాత్రికి ఇరాన్ జాతి మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని కూడా ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.

 

ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇరాన్‌లో ఉన్న విద్యార్థులు, వ్యాపారులు, యాత్రికులు సహా భారతీయులందరి భద్రతకే తమ ప్రథమ ప్రాధాన్యత అని ప్రభుత్వం స్పష్టం చేసింది.

 

అత్యవసర సహాయం కోసం రాయబార కార్యాలయం 24 గంటలూ పనిచేసేలా ప్రత్యేక మొబైల్ నంబర్లను (+989128109115, +989128109102, +989128109109, +989932179359) అందుబాటులోకి తెచ్చింది. అలాగే cons.tehran@mea.gov.in ఈ-మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపింది. పరిస్థితి వేగంగా మారే అవకాశం ఉన్నందున, పౌరులందరూ అధికారిక ప్రకటనలను నిరంతరం గమనిస్తూ ఉండాలని విజ్ఞప్తి చేసింది.

ANN TOP 10