AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సమ్మక్క సాగర్ ప్రాజెక్టు ఎన్‌ఓసీపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రితో రేవంత్ రెడ్డి భేటీ..

ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద గోదావరి నదిపై నిర్మించిన బహుళ ప్రయోజనాల సమ్మక్క సాగర్ బ్యారేజీకి సంబంధించి వెంటనే నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) జారీ చేయాలని ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాయ్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సమ్మక్క సాగర్ ప్రాజెక్టు సమగ్ర వివరాలను ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వానికి వివరించి, త్వరితగతిన ఎన్‌ఓసీ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం విష్ణుదేవ్ సాయి సానుకూలంగా స్పందిస్తూ, ఎన్‌ఓసీ ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణలో నీటి అవసరాలు పెరిగే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రజల తాగు, సాగునీటి అవసరాల నిమిత్తం సమ్మక్క సాగర్‌ బ్యారేజీలో నీటిని నిల్వ చేసుకునేందుకు అనుమతించాలని, మిగిలిన క్లియరెన్సుల విషయంలోనూ సహకరించాలని కోరారు. కరవు ప్రభావిత, వెనుకబడిన, గిరిజన ప్రాంతాల అవసరాలను తీర్చేందుకు గోదావరి జలాలను వినియోగించుకోవడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.

గతంలో ఈ ప్రాజెక్టును కాంతనపల్లి వద్ద ప్రతిపాదించగా, అక్కడ 11,408 ఎకరాల భూమి ముంపునకు గురయ్యే పరిస్థితి ఉండేది. దీనివల్ల 17 ఆదివాసీ గ్రామాలు మునిగిపోవడంతో పాటు భద్రత, మౌలిక వసతులపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఏర్పడింది. దాంతో ముంపు తీవ్రతను కనిష్ఠ స్థాయికి తగ్గించేందుకు బ్యారేజీ నిర్మాణ ప్రదేశాన్ని తుపాకులగూడెంకు మార్చినట్లు ముఖ్యమంత్రి వివరించారు.

ప్రాజెక్టు ప్రభావంపై అధ్యయనం జరిపేందుకు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం కోరిన మేరకు తెలంగాణ సర్కార్ రూ. 9.883 కోట్లను ఏప్రిల్‌లోనే చెల్లించింది. అనంతరం క్షేత్రస్థాయి అధ్యయనం పూర్తి చేసిన ఐఐటీ ఖరగ్‌పూర్‌ తన నివేదికను జూలై 30న ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వానికి అందజేసింది. తుపాకులగూడెం వద్ద బ్యారేజీ నిర్మించడం వల్ల ఛత్తీస్‌గఢ్‌ పరిధిలో కేవలం 33 ఎకరాల భూమి మాత్రమే ముంపునకు గురవుతుందని ఈ నివేదిక స్పష్టం చేసింది. అత్యంత భారీ వరదలు వచ్చిన సందర్భంలో కూడా ఈ ముంపు ప్రాంతం 100 ఎకరాలకు మించదని తేలింది.

తుపాకులగూడెం వద్ద ఇప్పటికే సమ్మక్క సాగర్‌ బ్యారేజీ నిర్మాణం పూర్తయింది. పూర్తిస్థాయి నీటిమట్టం +83 మీటర్ల వద్ద ఈ బ్యారేజీ నిల్వ సామర్థ్యం 6.94 టీఎంసీలుగా ఉంది. ఛత్తీస్‌గఢ్ భూభాగంలో అవసరమైన భూసేకరణ, పరిహారం, పునరావాస చర్యలకు సంబంధించి నిబంధనల ప్రకారం నిధులు చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిర్మాణం పూర్తయినందున ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎన్‌ఓసీ జారీతో పాటు ఇతర అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ANN TOP 10