AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అభయ హస్తం.. శూన్య హస్తం..! హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు..

మేనిఫెస్టోకు మూడేళ్లు.. కాంగ్రెస్ నయవంచనకు మూడేళ్లు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ గొప్పగా చెప్పుకున్న అభయహస్తం.. హామీలను అమలు చేయని మొండి హస్తంగా మారిందన్నారు. మంగళవారం ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు. మేనిఫెస్టో మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్‌తో సమానమని, దానిని తూచా తప్పకుండా అమలు చేస్తామని మూడేళ్ల క్రితం ఇదే రోజు మల్లికార్జున ఖర్గే సమక్షంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు. మూడేళ్లు గడిచినా ఆ హామీలకు దిక్కులేదు.

అమలు ఊసే లేదు. అభయ హస్తం.. శూన్య హస్తం అయ్యిందన్నారు. ఓట్లు వేసిన ప్రజలనే కాదు.. ఒట్లు వేసి దేవుళ్లను, పవిత్ర గ్రంథాలను సైతం మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది అన్నారు. గాంధీ భవన్ సాక్షిగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేదన్నారు. ఖర్గే, రేవంత్ రెడ్డి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తొలి క్యాబినెట్‌లోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న హామీ నీటిమూటగానే మిగిలిందన్నారు. ఇప్పటివరకు 38 క్యాబినెట్ సమావేశాలు జరిగినా.. ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత ఎందుకు కల్పించలేదు? అన్నారు. మేనిఫెస్టో పేరుతో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి, హామీల అమలును గాలికొదిలేశారన్నారు.

ఆరు గ్యారెంటీలు 420 హామీలతో అరచేతిలో వైకుంఠం చూపించి, అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క హామీకి తూట్లు పొడిచారన్నారు. గాంధీ పేరు చెప్పుకుని రాజకీయాలు చేసే కాంగ్రెస్.. గాంధీభవన్ సాక్షిగా ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేక పోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరి చూస్తే గాంధీ ఆత్మ కూడా క్షోభిస్తుందన్నారు. ప్రజల ఆశలను ఓట్లుగా మార్చుకున్నారు.. అధికారాన్ని అందుకున్నాక ఆ ఆశలను ఆవిరి చేశారన్నారు.హామీలు అమలు చేయకుండా మూడేళ్లుగా ప్రజలను మభ్యపెట్టడమే కాంగ్రెస్ సాధించిన ఘనత అన్నారు. కాంగ్రెస్ మాయమాటలను, నయవంచనను తెలంగాణ ప్రజలు ఇప్పటికే గుర్తించారని, ఇక మిగిలింది తగిన గుణపాఠం చెప్పడమేనన్నారు.

ANN TOP 10