పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం మండలం, జొన్నలగరువు గ్రామంలో ఒక చిన్నారి తన సమయస్ఫూర్తితో కన్నతల్లి ప్రాణాలను కాపాడి పునర్జన్మ ఇచ్చాడు. ఐదో తరగతి చదువుతున్న దీక్షిత్ అనే బాలుడి తల్లి, స్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌కు రాకపోవడంతో, తల్లిని చూడటానికి ఇంటికి వెళ్ళాడు. అప్పుడే ఆమెకు కరెంట్ షాక్ తగిలి కొట్టుమిట్టాడుతున్న విషయాన్ని దీక్షిత్ గమనించాడు.
ఆ అత్యవసర పరిస్థితిలో పది, పన్నెండేళ్ల వయసున్న దీక్షిత్ భయపడకుండా, ధైర్యంగా వ్యవహరించాడు. భయంతో ఇరుగు పొరుగు వారిని పిలిచేంత సమయం లేదని గ్రహించిన దీక్షిత్, తెలివిగా ఆలోచించి కరెంట్ షాక్‌కు కారణమైన మోటార్ స్విచ్‌ను వెంటనే ఆఫ్ చేశాడు. ఆ తర్వాత తల్లిపై పడిన కరెంట్ తీగను కర్ర సాయంతో తొలగించి, ప్రాణాపాయం నుంచి ఆమెను కాపాడాడు.
తరువాత, దీక్షిత్ తన తల్లిని వెంటబెట్టుకుని ఆస్పత్రికి వెళ్ళాడు. అక్కడ డాక్టర్లు ప్రథమ చికిత్స అందించడంతో ఆమె కోలుకుంది. ఈ ఘటన తర్వాత దీక్షిత్ తన తల్లితో కలిసి స్కూల్లో జరిగిన పేరెంట్ టీచర్ మీటింగ్‌కు హాజరయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు దీక్షిత్ చూపిన చాకచక్యాన్ని, సమయస్ఫూర్తిని ఎంతగానో మెచ్చుకుంటూ ప్రశంసించారు.









