కేరళలోని ఇడుక్కి జిల్లా మున్నార్ నగర పంచాయతీ ఎన్నికల్లో ఒక ఆసక్తికరమైన రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పేరుతో ఉన్న మహిళ ఈసారి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇది ఈ ఎన్నికల్లో ప్రధాన ట్విస్ట్‌గా మారింది.
ఈ బీజేపీ అభ్యర్థి అయిన సోనియా గాంధీ తండ్రి, దివంగత దురైరాజ్, గతంలో నల్లతన్ని కల్లార్ ప్రాంతానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడుగా ఉండేవారు. ఆయన కాంగ్రెస్ పార్టీపై ఉన్న అభిమానంతో తన కుమార్తెకు సోనియా గాంధీ పేరు పెట్టారు. అయితే, ఉన్నత చదువులు పూర్తి చేసిన తర్వాత, ఈ సోనియా గాంధీ బీజేపీలో చురుకుగా ఉంటూ, పంచాయతీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న సుభాష్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.
తన భర్త సుభాష్ ప్రోత్సాహంతో సోనియా గాంధీ తన రాజకీయ జీవితంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమె కమలం గుర్తుపై నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే, ప్రత్యర్థికి తమ అగ్రనేత పేరు ఉండటం వలన అదే వార్డులో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మంజుల రమేష్ తో పాటు, హస్తం పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒకే పేరు ఉండటం వలన ఓటర్లు గందరగోళానికి గురై, ఓట్లు చీలిపోతాయేమోనని వారు భయపడుతున్నారు.








