మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చి బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ భారీ యాక్షన్ ఘట్టాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ కీలక షెడ్యూల్లో రామ్ చరణ్‌తో పాటు కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ (శివన్న) కూడా పాల్గొంటున్నారు.
ఈ హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌కు బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ స్టంట్ డైరెక్టర్, హీరో విక్కీ కౌశల్ తండ్రి అయిన షామ్ కౌశల్ పర్యవేక్షణ అందిస్తుండటం విశేషం. ‘దంగల్’, ‘బాజీరావ్ మస్తానీ’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు పనిచేసిన ఆయన ఆధ్వర్యంలో నవకాంత్ మాస్టర్ ఈ ఫైట్‌ను కొరియోగ్రఫీ చేస్తున్నారు. వందలాది మంది ఫైటర్లు పాల్గొంటున్న ఈ సన్నివేశాన్ని అత్యంత సహజంగా, ‘రఫ్ అండ్ రా’ మాస్ యాక్షన్‌తో తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. సినిమా కథలో ఈ ఫైట్ అత్యంత కీలకమైన మలుపుగా నిలుస్తుందని, సినిమాకే హైలైట్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు, ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని తొలి సింగిల్ 100 మిలియన్ల వ్యూస్ దాటి సంచలనం సృష్టించింది. త్వరలోనే రెండో పాటను విడుదల చేసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు









