AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీకి ‘దిత్వా’ తుపాను ముప్పు.. !

నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘దిత్వా’ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముందుజాగ్రత్త చర్యగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుపాను తీరం దాటే అవకాశం లేనప్పటికీ, తీరం వెంబడి కదులుతూ బలహీనపడనుందని, దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు తప్పవని స్పష్టం చేసింది.

 

శనివారం మధ్యాహ్నం నాటికి ఈ తుపాను చెన్నైకి దక్షిణంగా 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ ఆదివారం ఉదయానికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు సమీపంగా రానుంది. తుపాను ప్రభావంతో ఆదివారం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, ప్రకాశం, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సోమ, మంగళవారాల్లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

 

తీరం వెంబడి గంటకు 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సముద్రం అలజడిగా మారడంతో సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కృష్ణపట్నం పోర్టుకు మూడో నంబరు, విశాఖ, మచిలీపట్నం, కాకినాడ సహా ఇతర పోర్టులకు రెండో నంబరు ప్రమాద హెచ్చరికలను కొనసాగిస్తున్నారు.

ANN TOP 10