పైరసీ వెబ్‌సైట్ ‘ఐ-బొమ్మ’ నిర్వాహకుడు ఇమంది రవి అరెస్ట్‌పై అనేక కథనాలు వస్తున్న నేపథ్యంలో, సైబర్ క్రైమ్ అడిషనల్ సీపీ శ్రీనివాస్ ఆ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. విడాకుల పనిమీద రవి హైదరాబాద్‌కు వచ్చాడని, ఈ సమాచారం అతడి భార్య పోలీసులకు ఇచ్చిందనే వార్తల్లో నిజం లేదని, ఆమెను పోలీసులు విచారించనే లేదని సీపీ తెలిపారు. కస్టడీలో రవి నుంచి అనేక కీలక విషయాలు రాబట్టామని, ఐ-బొమ్మ వెబ్‌సైట్‌ను రవి మరో కంపెనీ నుంచి హోస్ట్ చేస్తున్నట్లు గుర్తించామని ఆయన మీడియాకు వెల్లడించారు.
ఐ-బొమ్మ రవి కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టం ద్వారా ఐ-బొమ్మ, బప్పం వెబ్‌సైట్ల ద్వారా సినిమాలను పోస్టు చేసేవాడని సీపీ శ్రీనివాస్ తెలిపారు. ఆయా వెబ్ సాఫ్ట్‌వేర్‌లలో రీడైరెక్ట్ స్క్రిప్ట్ రాసి, యూజర్లను గేమింగ్, బెట్టింగ్ వెబ్‌సైట్లకు మళ్ళించేవాడని వివరించారు. ఈ విధంగా రవి సుమారు రూ. 20 కోట్ల వరకు అక్రమంగా సంపాదించాడని అంచనా వేశామని తెలిపారు. రవి అతి విశ్వాసంతో ఉన్నాడని, ఈజీ మనీకి అలవాటు పడి లక్ష డాలర్లు వెచ్చించి కరేబియన్ దీవుల పౌరసత్వం కూడా కొనుగోలు చేశాడని విచారణలో గుర్తించినట్లు సీపీ పేర్కొన్నారు.
అయితే, ఐ-బొమ్మ, బప్పం లాంటి పైరసీ వెబ్‌సైట్లు మూతబడినప్పటికీ, మూవీరూల్జ్, తమిళ్ఎంవీ లాంటి ఇతర పైరసీ వెబ్‌సైట్లు ఇప్పటికీ నడుస్తున్నాయని సీపీ శ్రీనివాస్ వెల్లడించారు. భవిష్యత్తులో వెబ్-3 సాంకేతికత అందుబాటులోకి వస్తే, పైరసీని అరికట్టడం మరింత కష్టమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం నడుస్తున్న ఇతర పైరసీ వెబ్‌సైట్ల నిర్వాహకులను పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.









