AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కార్పొరేటర్ల పోరాటంపై కేటీఆర్ ప్రశంసలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు పోరాడిన తీరును ప్రశంసించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన జీహెచ్ఎంసీ పరిధిలోని శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కార్పొరేటర్లతో చర్చించారు. బల్దియా సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, పార్టీకి అండగా నిలబడిన ప్రతి కార్పొరేటర్‌కు భవిష్యత్తులో మరిన్ని పదవులు వస్తాయని భరోసా ఇచ్చారు.

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అవినీతికి తావులేకుండా పారదర్శకంగా పని చేసిందని, అలాగే కరోనా వంటి సంక్షోభ సమయంలోనూ అద్భుతంగా సేవలందించారని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని అభినందించారు. ముఖ్యంగా, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో వారి అద్భుతమైన పోరాటాన్ని ప్రత్యేకంగా కొనియాడారు.

అంతేకాకుండా, జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. పరిశ్రమలకు కేటాయించిన భూములతో పాటు హైదరాబాద్‌లో జరుగుతున్న భూముల అమ్మకంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కార్పొరేటర్లకు సూచించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వం వైఫల్యంపై కూడా గట్టిగా ప్రశ్నించాలని కోరారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

ANN TOP 10