AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

2047 నాటికి భారత్ అగ్రస్థానం: సత్యసాయి విద్యాసంస్థల క్రమశిక్షణ అమోఘం – ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, రాబోయే సంవత్సరాలలో భారతదేశం ప్రపంచ వేదికపై అగ్రస్థానంలో నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే నెంబర్-1 స్థానంలో నిలుస్తుందని, ఈ అభివృద్ధిలో నేటి పట్టభద్రులు కీలక భాగస్వాములు కానున్నారని ఆయన అన్నారు. గత మూడు రోజులుగా దేశంలోని అత్యున్నత స్థాయి ప్రముఖులు ఈ శత జయంత్యుత్సవాల్లో పాల్గొనడం బాబా శక్తిని తెలియజేస్తోందన్నారు.

శ్రీ సత్యసాయి విద్యాసంస్థల క్రమశిక్షణ, నిబద్ధతను ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా ప్రశంసించారు. “ఈ విద్యాసంస్థల్లో కనిపించే క్రమశిక్షణ, నిబద్ధత మరే యూనివర్శిటీలోనూ కనిపించవు” అని ఆయన అన్నారు. స్నాతకోత్సవంలో విద్యార్థులందరూ ఎంతో క్రమశిక్షణతో నేలపై కూర్చోవడం తనను ఆశ్చర్యపరిచిందని తెలిపారు. ఎంతమందిని గ్రాడ్యుయేట్లుగా తీర్చిదిద్దామనేది కాకుండా, ఎంతమందిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దామనే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేయడం అభినందనీయమని ఆయన కొనియాడారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ యవనికపై తనదైన ముద్ర వేస్తోందని రాధాకృష్ణన్ అన్నారు. ఒకప్పుడు ప్రపంచం చెప్పేది భారత్ వినేదని, కానీ ఇప్పుడు భారత్ చెప్పేది ప్రపంచం వింటోందని వ్యాఖ్యానించారు. కోవిడ్ సమయంలో భారత్ టీకాలను కనుగొని, 100కు పైగా దేశాలకు ఉచితంగా అందించిందని గుర్తు చేశారు. పట్టాలు అందుకున్న విద్యార్థులే భవిష్యత్ లీడర్లని ఆశాభావం వ్యక్తం చేస్తూ, సత్యసాయి సిద్ధాంతాలను ప్రపంచానికి తీసుకెళ్లాల్సిన బ్రాండ్ అంబాసిడర్లు విద్యార్థులేనని పిలుపునిచ్చారు. అలాగే, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ‘నో టూ డ్రగ్స్’ అంటూ యువత పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలని ఆయన కోరారు.

ANN TOP 10