AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లంచం తీసుకుంటుండగా పట్టుకునేందుకు వెళ్లిన ఏసీబీ: గోడ దూకి పారిపోయిన ఎస్ఐ

మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ఎస్ఐ రాజేశ్‌ లంచం తీసుకుంటుండగా, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కకుండా ఉండేందుకు ఏకంగా గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించారు. టేక్మాల్‌ మండలం హసన్‌మహ్మద్‌పల్లి తండా శివారులో నవంబర్ 1న వరికోత యంత్రం బ్యాటరీలను స్థానికులైన పాండు, పరశురాంలు చోరీచేశారు. ఈ చోరీ విషయంలో కేసు నమోదు చేయకుండా ఉండాలంటే, ఎస్‌ఐ రాజేశ్‌ వారిని రూ.40 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఎస్ఐ రాజేశ్‌ డబ్బుల కోసం వేధించడంతో, పాండు, పరశురాంలు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పాండు నుంచి స్టేషన్‌లో ఎస్‌ఐ రాజేశ్‌ లంచం తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు అతడిని పట్టుకునేందుకు వచ్చారు. అధికారులను చూసిన వెంటనే ఎస్‌ఐ రాజేశ్‌ అప్రమత్తమై అక్కడి నుంచి తప్పించుకునేందుకు పరుగుతీశారు. పారిపోయే క్రమంలో ఏకంగా గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేశారు.

అయితే, ఏసీబీ అధికారులు అతడిని అంత సులభంగా వదలలేదు. ఎస్‌ఐ రాజేశ్‌ వెంటపడిన అధికారులు, చివరకు అతడిని టేక్మాల్‌ మార్కెట్‌ సమీపంలో పట్టుకున్నారు. అవినీతికి పాల్పడి, పోలీసులకు చిక్కకుండా తప్పించుకునేందుకు గోడ దూకిన ఎస్ఐ ఉదంతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఏసీబీ అధికారులు రాజేశ్‌ను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ చేపట్టారు.

ANN TOP 10