కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ రష్యాలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మిట్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గట్టి సందేశాన్నిచ్చారు. భారత ప్రజలను ఉగ్రవాదం నుంచి రక్షించుకునే హక్కు దేశానికి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదని, ఈ విషయంలో సమర్థించే ధోరణి ఉండకూడదని ఆయన తేల్చి చెప్పారు.
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం అనేది అన్ని దేశాలకు ఉమ్మడి ప్రాధాన్యంగా ఉండాలని జైశంకర్ సూచించారు. ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేయాలని ఆయన సమ్మిట్‌లో పాల్గొన్న దేశాలకు పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ యొక్క కఠిన వైఖరిని మరోసారి చాటి చెప్పాయి.
మూడు రోజుల పర్యటనలో భాగంగా రష్యాలో ఉన్న జైశంకర్, ఎస్సీవో సదస్సులో పాల్గొనడానికి ముందు రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లవ్రోవ్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరువురు ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపినట్లు సమాచారం.








