తెలుగు సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలుగజేస్తున్న పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు రవి ఇమ్మడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ‘దమ్ముంటే పట్టుకోండి’ అంటూ గతంలో పోలీసులకే సవాల్ విసిరిన రవిని విచారించగా, అతని నేర మార్గం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ వెలుగులోకి వచ్చింది. తన సంపాదన సరిపోవడం లేదంటూ భార్య, అత్తగారి నుంచి ఎదురైన హేళనలు, అవమానాలే అతన్ని ఈ పైరసీ వెబ్‌సైట్‌ను ప్రారంభించేందుకు ప్రేరేపించినట్లు విచారణలో తేలింది.
వెబ్ డిజైనర్‌గా పనిచేసే రవి, 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, తన జీతం తక్కువగా ఉందని, డబ్బు సంపాదించడం చేతకాదని కుటుంబ సభ్యులు పదే పదే విమర్శించడంతో రవి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. డబ్బు సంపాదించాలనే కసితో, తనకున్న నైపుణ్యాన్ని ఉపయోగించి ‘ఐబొమ్మ’ మరియు ‘బప్పం టీవీ’ వంటి పైరసీ వెబ్‌సైట్లను సృష్టించాడు. కొద్ది కాలంలోనే, ఈ వెబ్‌సైట్‌లకు బెట్టింగ్ యాప్‌ల నుంచి భారీగా ప్రకటనలు రావడంతో అతను అపారమైన డబ్బును ఆర్జించాడు.
ఆ తర్వాత, 2021లో భార్యతో విడాకులు తీసుకున్న రవి, తన మకాం నెదర్లాండ్స్‌కు మార్చి అక్కడి నుంచే వెబ్‌సైట్లను నిర్వహించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అతను సుమారు 50 లక్షల మంది యూజర్ల వ్యక్తిగత డేటాను సైబర్ నేరగాళ్లకు, గేమింగ్ ముఠాలకు అమ్మి ఏకంగా రూ. 20 కోట్లు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. కూకట్‌పల్లిలోని తన ఫ్లాట్‌ను విక్రయించి విదేశాల్లో స్థిరపడాలనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చిన రవిని పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. చట్టానికి సవాల్ విసిరే నేరస్థులు జైలుకు వెళ్లక తప్పదని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.







