తొలిసారిగా అసెంబ్లీకి పంపించిన పిఠాపురం నియోజకవర్గంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎనలేని అభిమానాన్ని పెంచుకున్నట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. పిఠాపురంలో స్థానికునిగా ప్రజలతో మమేకమయ్యేందుకు, రాబోయే రోజుల్లోనూ ఈ నియోజకవర్గం నుంచే తన రాజకీయ ప్రస్థానం కొనసాగుతుందని స్పష్టం చేసేందుకు ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పిఠాపురంలో 18 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన పవన్ కల్యాణ్, తాజాగా ఈ నెల 13న మరో 2.63 ఎకరాల భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ భూములకు ఆనుకుని మరో 2 ఎకరాలకు పైగా భూమిని కొనుగోలు చేసేందుకు కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ తాజాగా కొనుగోలు చేసిన ఈ స్థలం 216వ జాతీయ రహదారిని ఆనుకుని, పిఠాపురం-గొల్లప్రోలు టోల్ ప్లాజాకు సమీపంలో, ఇలింద్రాడ రెవెన్యూ పరిధిలో ఉంది. ఈ స్థలంలో జనసేన పార్టీ కార్యాలయంతో పాటు, ఆయనకు ప్రత్యేకంగా ఉపయోగపడే గెస్ట్‌హౌస్ నిర్మాణం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. భారీ మొత్తంలో డబ్బు వెచ్చించి ఈ భూమిని ఆయన దక్కించుకుంటున్నట్లు తెలుస్తోంది. గొల్లప్రోలుకు చెందిన జలిగంపల కమల నుంచి 2.63 ఎకరాల భూమిని కొనుగోలు చేయగా, ఆయన తరపున సివిల్ సప్లై ఛైర్మన్ తోట సుధీర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
స్థానికేతరుడు అనే అపనిందను తొలగించుకుని, ప్రజలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతోనే పవన్ కల్యాణ్ తన భవిష్యత్తు ప్రణాళికను పిఠాపురం నుంచే సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెలఖరు నాటికి పక్కనే ఉన్న మరో ఇద్దరు రైతుల భూమిని కూడా కొనుగోలు చేసి, మరో రెండు మూడు నెలల్లో పార్టీ కార్యాలయం మరియు గెస్ట్‌హౌస్ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ పిఠాపురం కేంద్రంగా తన భవిష్యత్తు రాజకీయ ప్రణాళికకు అడుగులు వేస్తున్నారని జనసైనికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.









