ఢిల్లీ రెడ్‌ఫోర్ట్ సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో గాయపడిన బాధితులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌నాయక్ జైప్రకాశ్ (LNJP) ఆసుపత్రిలో పరామర్శించారు. భూటాన్ పర్యటన నుంచి ఢిల్లీకి చేరుకున్న వెంటనే ఆయన నేరుగా ఆసుపత్రికి వెళ్లి, గాయాలతో బాధపడుతున్నవారితో మాట్లాడి, వారికి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని, “ఈ హేయమైన కుట్రకు పాల్పడినవారిని తప్పకుండా న్యాయస్థానం ముందు నిలబెడతాము!” అని తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో స్పష్టం చేశారు, దోషులను శిక్షించే విషయంలో ప్రభుత్వ నిబద్ధతను తెలియజేశారు.
పేలుడు జరిగిన సమయంలో భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ, ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ఢిల్లీలో జరిగిన ఈ దుర్ఘటన హృదయాన్ని కలచివేసింది… దేశం మొత్తం బాధిత కుటుంబాలకు అండగా ఉంది” అని తిమ్ఫూలో వ్యాఖ్యానించారు. ఆసుపత్రి సందర్శన తర్వాత, పేలుడు సంఘటన వివరాలు, చికిత్స అందిస్తున్న తీరుపై అధికారుల నుంచి బ్రీఫింగ్ తీసుకున్నారు. అంతేకాకుండా, పేలుడుకు సంబంధించిన పరిస్థితులు మరియు దర్యాప్తు పురోగతిని సమీక్షించడానికి ఆయన ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ఈ పేలుడు ఘటన దర్యాప్తును ఎన్‌ఐఏ (NIA) స్వీకరించి విచారణను వేగవంతం చేసింది. పేలుడు సమయంలో కారులో ఉన్న వ్యక్తి డాక్టర్ ఉమర్ యు నబీ అని, ఇతను నిషేధిత ఉగ్రవాద సంస్థ అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్‌కు చెందినవాడుగా భావిస్తున్నారు. డాక్టర్ ఉమర్ ఫోన్ నుంచి లభించిన ఆధారాల ప్రకారం, ఈ దాడిని మొదట రిపబ్లిక్ డే (జనవరి 26) రోజున లక్ష్యంగా చేసుకుని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయోధ్యలోని రామ్ మందిరం కూడా ఉగ్రవాదుల తదుపరి లక్ష్యంగా ఉండవచ్చనే సమాచారం లభించింది.








