భారతదేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలన్న బృహత్తర లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉన్నత విద్యారంగంలో సమూలమైన సంస్కరణలు అత్యవసరం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అమరావతిలో జరిగిన ‘హయ్యర్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ – 2025’లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన, మన గ్రాడ్యుయేట్లలో కేవలం 51 శాతం మంది మాత్రమే ఉద్యోగాలకు అర్హులుగా ఉన్నారని ఆర్థిక సర్వే 2023-24 నివేదికను ఉటంకిస్తూ తెలిపారు.
ఈ నైపుణ్యాల కొరతకు గల కారణాన్ని వివరిస్తూ లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన విద్యాసంస్థల్లో 3-4 ఏళ్ల కోర్సులు పూర్తి చేసినా యువతకు ఉద్యోగాలు రావడం లేదని, కానీ హైదరాబాద్‌లోని అమీర్‌పేట కోచింగ్ సెంటర్లు కేవలం 3-4 నెలల శిక్షణతోనే వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయని ఆయన అన్నారు. విద్యాసంస్థల్లో బోధించే అంశాలకు, పరిశ్రమల అవసరాలకు మధ్య ఉన్న అసమతుల్యతే ఈ అంతరానికి ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అంతరాన్ని పూడ్చడానికి డిగ్రీలతో పాటు క్రియాశీల నైపుణ్యాలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.
నైపుణ్యాల కొరతను అధిగమించి, యువతను పరిశ్రమలకు సిద్ధం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో తమ ప్రభుత్వం ‘స్కిల్ సెన్సస్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు లోకేశ్ వెల్లడించారు. దీని ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడి నైపుణ్యాలను అంచనా వేసి, వారికి అవసరమైన శిక్షణ ఇచ్చి పరిశ్రమలకు సిద్ధం చేయడమే లక్ష్యమని తెలిపారు. ఉన్నత విద్యారంగాన్ని నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ హబ్‌గా మార్చేందుకు కరిక్యులమ్ టు కెరీర్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ వంటి ఐదు కీలక అంశాలపై తమ ప్రభుత్వం దృష్టి సారించినట్లు ఆయన వివరించారు.








