బీహార్ అసెంబ్లీ మరియు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. అత్యధికంగా సర్వేలు ఎన్డీఏ (NDA) కూటమికే అనుకూలంగా వచ్చాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీని అంచనా వేయడంతో ఆ పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జేవీసీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, బీహార్లో ఎన్డీఏకు 130 నుంచి 150 స్థానాలు వస్తాయని అంచనా వేయగా, మహాఘట్బంధన్కు 88 నుంచి 103 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశముందని తెలిపింది. జనసురాజ్ పార్టీ ఒకటి లేదా రెండు స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశముందని అంచనా.
మరొక సర్వే సంస్థ మ్యాట్రిజ్ ప్రకారం కూడా ఎన్డీఏకు 147 నుంచి 167 సీట్లు వస్తాయని, మహాఘట్బంధన్కు 70 నుంచి 90 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశముందని అంచనా వేసింది. ఈ అంచనాలు బీహార్లో ఎన్డీఏ అధికారాన్ని నిలబెట్టుకుంటుందనే సూచనను ఇస్తున్నాయి. మరోవైపు, తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాయి.
జూబ్లీహిల్స్లో చాణక్య స్ట్రాటజీస్ సర్వే ప్రకారం కాంగ్రెస్కు 46%, బీఆర్ఎస్కు 41%, బీజేపీకి 8% ఓట్లు వస్తాయని తేలింది. అలాగే, పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ 48%, బీఆర్ఎస్ 41%, బీజేపీ 6% ఓట్లు వస్తాయని అంచనా వేసింది. దాదాపు అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా రావడంతో, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.









