మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాంపల్లిలోని సీబీఐ కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో యూరప్ (లండన్) పర్యటనకు వెళ్లిన జగన్‌ను నవంబర్ 14వ తేదీలోగా కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే, జగన్ అభ్యర్థనపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అభ్యంతరం వ్యక్తం చేస్తూ కౌంటర్ దాఖలు చేయడంతో, ఆయన కోర్టు ఎదుట హాజరు కానున్నారు.
వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు వారం రోజుల సమయం ఇవ్వాలని వైఎస్ జగన్ తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. దీనికి అంగీకరించిన సీబీఐ కోర్టు, నవంబర్ 21వ తేదీ వరకు సమయం ఇస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆలోపు జగన్ నాంపల్లి సీబీఐ కోర్టులో వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. గతంలో, తాను కోర్టుకు హాజరైతే ప్రభుత్వ యంత్రాంగానికి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాల్సి వస్తుందని, ఇది ప్రభుత్వానికి భారమని జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అందువల్ల వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు.
అయితే, వైఎస్ జగన్ అభ్యర్థనపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయన కోర్టు ఎదుట హాజరు కాక తప్పలేదు. లండన్ పర్యటనకు అనుమతి ఇచ్చినప్పుడే, పర్యటన పూర్తయిన తర్వాత నవంబర్ 14వ తేదీలోగా వ్యక్తిగతంగా హాజరు కావాలని సీబీఐ కోర్టు షరతు విధించింది. ఈ నేపథ్యంలో, వారం రోజుల గడువు తీసుకుని, నవంబర్ 21లోగా వైఎస్ జగన్ సీబీఐ కోర్టు ముందుకు హాజరు కాబోతున్నారు.









