ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి నగరంలో ర్యాపిడో బైక్ రైడర్ ఒక మహిళా కస్టమర్‌పై అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే, శనివారం అర్ధరాత్రి సుమారు 12.30 గంటల సమయంలో ఓ బ్యూటీ పార్లర్లో పనిచేసే మహిళ ఇంటికి వెళ్లేందుకు ర్యాపిడో బుక్ చేసుకుంది. పెద్దయ్య అనే రైడర్ ఆమెను పికప్ చేసుకొని గమ్యానికి బయల్దేరాడు.
మార్గమధ్యంలో సాధారణంగానే ఉన్న రైడర్, గమ్యానికి చేరుకున్న తర్వాత మాత్రం అకస్మాత్తుగా అసభ్యంగా ప్రవర్తించాడు. గమ్యం చేరుకోగానే, రైడర్ బలవంతంగా ఆ మహిళకు ముద్దు పెట్టడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటనతో షాక్ అయిన బాధితురాలు కేకలు వేయడంతో పరిసరాల్లో ఉన్నవారు అప్రమత్తమయ్యారు.
అదే సమయంలో బాధితురాలి భర్త అక్కడికి చేరుకుని ర్యాపిడో రైడర్‌ను పట్టుకున్నారు. వెంటనే, అక్కడ నైట్ పేట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వచ్చి రైడర్‌ను తమ అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.









