జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు అనుసరిస్తున్న తీరుపై ఆ పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టిఫిన్ సెంటర్లలో దోసెలు వేయడం, కూరగాయలు అమ్మడం, హెయిర్ సెలూన్లో కటింగ్ చేయడం వంటి ‘కామెడీ స్కిట్స్’ మానేయాలని నేతలకు హితోపదేశం చేశారట. ఎన్నికల ప్రచారం అంటే సరదా కాదని, సీరియస్ క్యాంపెయిన్ చేయాలని గులాబీ బాస్ దిశానిర్ధేశం చేసినట్లు సమాచారం. మాజీ మంత్రి మల్లారెడ్డి వంటి కొందరు నేతలు ఈ తరహా సరదా పనులను ప్రచారంలో భాగం చేయడంతో, అది ఓటర్లను ఆకర్షించలేదని కేసీఆర్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని కేసీఆర్ పార్టీ నేతలను ఆదేశించారు. ఈ ఎన్నిక రానున్న స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే, ప్రచారంలో తమ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా వివరించాలని సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్లో మౌలిక వసతుల అభివృద్ధి, రోడ్లు, తాగునీటి సౌకర్యం, ఐటీ రంగ అభివృద్ధి, శాంతిభద్రతలు వంటి అంశాలను హైలైట్ చేయాలని ఆదేశించారు.
ఇదే సమయంలో, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ సూచించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు కాలేదన్న అంశాన్ని బలంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. ప్రచారంలో ఇలాంటి కామెడీ స్కిట్స్ సోషల్ మీడియా ప్రచారానికి పనికొస్తాయే తప్ప, ఓటర్లను ఏ మాత్రం ఆకట్టుకోలేవని కేసీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ హితోపదేశంతోనైనా బీఆర్ఎస్ నేతలు తమ ఎన్నికల ప్రచారాన్ని ఇకపై మరింత సీరియస్గా తీసుకుంటారో లేదో చూడాలి.









