ప్రజల్లో సినిమా క్రేజ్‌ను సొమ్ము చేసుకునేందుకు సైబర్ మోసగాళ్లు కొత్త పంథాలను అవలంబిస్తున్నారు. తాజాగా ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి ది ఎపిక్’ సినిమాపై ఏర్పడిన హైప్‌ను దుర్వినియోగం చేస్తూ సోషల్ మీడియాలో కొందరు దందా ప్రారంభించారు. “Heisenberg M” అనే పేరుతో ఒక వ్యక్తి ట్విట్టర్ (X)లో ప్రీమియర్ షో టికెట్లు ఉన్నాయని, కావాలంటే మెసేజ్ చేయాలని పోస్ట్ చేశాడు. బాహుబలి ఫ్రాంచైజ్‌కి ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా చాలామంది అభిమానులు ఆ ట్వీట్‌ను నమ్మి, అతనికి మెసేజ్ చేశారు.
మోసగాడు “టికెట్‌లు లిమిటెడ్.. వెంటనే బుక్ చేసుకోండి” అని నమ్మబలికి, తన 9391872952 నంబర్‌కి డబ్బులు పంపాల్సిందిగా కోరాడు. కొంతమంది అభిమానులు టికెట్లు కొంటామని నమ్మి ఆ నంబర్‌కు డబ్బులు పంపారు. అయితే, డబ్బులు పంపిన వెంటనే ఆ వ్యక్తి వారిని ఆ నంబర్ నుండి బ్లాక్ చేశాడు. దీంతో మోసపోయిన అభిమానులు సోషల్ మీడియాలో తమ అనుభవాలను పంచుకుంటూ, ఇతర అభిమానులను అప్రమత్తం చేస్తున్నారు. ఈ మోసపూరిత ఖాతాలను గుర్తించి, సైబర్ పోలీసులకు రిపోర్ట్ చేశారు.
ఈ ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించి దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ క్రైమ్ విభాగం ప్రజలకు ముఖ్యమైన సూచన చేసింది: “అధికారిక బుకింగ్ ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారానే టికెట్లు కొనాలి, సోషల్ మీడియా ద్వారా డబ్బులు పంపరాదు”. బాహుబలి వంటి భారీ సినిమాల విడుదల సమయాల్లో అభిమానుల్లో ఉండే ఉత్సాహాన్ని మోసగాళ్లు ఉపయోగించుకుంటారని అధికారులు హెచ్చరించారు. ఇలాంటి మోసపూరిత పోస్టులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.









