AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘మహిళలను అవమానించడమే ఇందిరమ్మ రాజ్యమా?’: సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘మహిళలను అవమానించడమే ఇందిరమ్మ రాజ్యమా?’ అని ఆమె ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని హామీ ఇచ్చి, ఇప్పుడు మహిళా కార్యకర్తలను, ఎమ్మెల్యేలను, అధికారులను అగౌరవపరుస్తోందని సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు. మంత్రులు మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకుని సమీక్షలు చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయని, దీనిపై విచారణ చేపట్టాలని మహిళా కమిషన్‌కు ఫిర్యాదు కూడా చేశామని ఆమె తెలిపారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎస్ శాంతి కుమారికి ఉన్నత పదవి కట్టబెట్టామని గుర్తు చేసిన సునీతా లక్ష్మారెడ్డి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా అధికారులను అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, మహిళా ప్రజాప్రతినిధులపై కూడా గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని, సీఎం ఢిల్లీ నివాసంలో ఒక అధికారిణికి కలిసే అవకాశం కూడా ఇవ్వకుండా అవమానించారని ఆమె ఆరోపించారు. మహిళా జర్నలిస్టులపై దాడులు, కేసులు పెట్టారని, కొత్తగూడెంలో గిరిజన మహిళను వివస్త్ర చేసిన ఘటన కూడా వెలుగు చూసిందని ఆమె పేర్కొన్నారు.

మహిళలను కోటీశ్వరులను చేయకపోయినా పర్వాలేదు, కనీసం మహిళల హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించవద్దని సునీతా లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని సూచించారు. గురుకులాల్లో విద్యార్థినులు వేధింపులకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆమె కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ANN TOP 10