AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దేశంలో మరో భారీ బంగారు గని గుర్తింపు: రాజస్థాన్‌లోని బాన్స్‌వారా జిల్లాలో 222 టన్నుల పసిడి నిల్వలు

దేశంలో అత్యంత ఖనిజ సంపద కలిగిన రాష్ట్రాల్లో ఒకటైన రాజస్థాన్, ఇప్పుడు బంగారు నిల్వల విషయంలో మరో సంచలనం సృష్టించింది. ఆ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతమైన బాన్స్‌వారా జిల్లాలోని ఘటోల్ తెహసీల్ – కంకారియా గ్రామం పరిధిలో ఆ రాష్ట్రంలో మూడో భారీ బంగారు నిల్వలు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. భూగర్భ శాస్త్రవేత్తల సర్వేల ప్రకారం, ఈ కొత్త గనిలో సుమారు 3 కిలోమీటర్ల విస్తీర్ణంలో బంగారు ఖనిజ నిల్వలు ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి.

ఈ కొత్త బంగారు నిల్వల్లో అత్యంత భారీగా పసిడి లభించబోతున్నట్లు భూగర్భ శాఖ ప్రాథమికంగా అంచనా వేస్తోంది. 940.26 హెక్టార్ల విస్తీర్ణంలో సుమారు 113.52 మిలియన్ టన్నుల బంగారు ఖనిజం ఉండవచ్చని అంచనా. ఈ ఖనిజాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత సుమారు 222.39 టన్నుల స్వచ్ఛమైన బంగారు లోహం లభించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాజస్థాన్‌లో ఇప్పటివరకు బయటపడిన అతిపెద్ద బంగారు నిల్వల్లో ఇది ఒకటిగా పేర్కొంటున్నారు.

కంకారియా-గారా ప్రాంతంలో బంగారంతో పాటు అనేక విలువైన ఖనిజాలు కూడా వెలికితీసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నిల్వలు బయటపడటంతో, భవిష్యత్తులో దేశానికి కావాల్సిన మొత్తం బంగారం డిమాండ్‌లో 25 శాతం వరకు బాన్స్‌వారా జిల్లా నుంచే సరఫరా అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభమైతే, బాన్స్‌వారా జిల్లా భారీగా ఉపాధి అవకాశాలు సృష్టించడంతో పాటు, రాజస్థాన్‌లో ఒక కీలక పారిశ్రామిక, ఆర్థిక కేంద్రంగా మారుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. లైసెన్స్ కోసం బిడ్లు నవంబర్ 3వ తేదీన తెరవనున్నారు.

ANN TOP 10