ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతమైన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ దగ్గర బుధవారం రాత్రి ఓ గోసంరక్షక కార్యకర్తపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడం స్థానికంగా కలకలం రేపింది. కాల్పుల్లో గాయపడిన ఆ గోరక్ష కార్యకర్త పేరు సోను అలియాస్ ప్రశాంత్. ప్రస్తుతం అతను సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యుల ప్రకారం, సోను పరిస్థితి విషమంగానే ఉంది. ఈ తరహా దాడిని హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఈ ఘటన స్థానికంగానే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. దాడి జరిగిన విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న మేడ్చల్ జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు పవన్ రెడ్డి మరియు ఇతర గోరక్ష కార్యకర్తలు, బాధితుడిని హుటాహుటిన సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే, సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా చోద్యం చూశారని గోరక్ష కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన స్థలంలో లభించిన బుల్లెట్ల ఆధారంగా కాల్పులు జరిపిన వాళ్లను వెంటనే పట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ దాడి వెనుక ముస్లింలు ఉన్నారని, మరీ ముఖ్యంగా మజ్లీస్ పార్టీకి చెందిన నాయకులే ఇదంతా చేయిస్తున్నారని స్థానికులు, గోరక్ష కార్యకర్తలు మరియు బీజేపీ నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో హైదరాబాద్ మహానగరంలో మళ్లీ మతపరమైన ఘర్షణలు జరుగుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం వెంటనే స్పందించి, పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.









