అభివృద్ధికి సహకరించడం లేదు..
కేసీఆర్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ ఫైర్..
తెలంగాణ రాష్ట్రంలోఅవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో కేసీఆర్ సర్కార్‌పై మండిపడ్డారు. కేంద్రం చేపడుతున్న అనేక ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనివల్ల ప్రాజెక్టుల పనులు ఆలస్యం అవుతున్నాయని అన్నారు. దీనివల్ల ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుందని మోదీ చెప్పారు.
అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించొద్దని ఆయన అన్నారు. రాష్ట్రంలో కుటుంబం పాలన అవినీతిని పెంచిపోషిస్తుందన్నారు. సొంత కుటుంబం ఎదిగితే చాలనుకుంటారు.. అన్ని విషయాల్లో వారికి కుటుంబ స్వార్థమే కావాలంటూ ఫైర్ అయ్యారు. ఇలాంటివారితో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. వారసత్వ రాజకీయంతో అవినీతిని పెంచి పోషిస్తున్నారు.. అవినీతిపరులపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలా వద్దా? అంటూ ప్రజలను కోరారు. నాపై పోరాటానికి అన్ని శక్తులు ఏకమయ్యాయి.. కోర్టుకు వెళ్లారు, అక్కడా వారికి షాక్ తగిలిందంటూ విమర్వించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యతను కేంద్రం తీసుకుందన్నారు ప్రధాని.
కేంద్రం చేపడుతున్న అభివృద్ధి పనులపై కొందరు వ్యక్తులు భయాందోళనలు చెందుతున్నారని విపక్ష పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధించారు ప్రధాని మోదీ. వారసత్వ రాజకీయాలు.. అవినీతే వారికి ప్రాధాన్యమని ఎద్దేవా చేశారు ప్రధాని. ఇలాంటి వారికి దేశాభివృద్ధి పట్టదని.. స్వార్థపూరిత ఆలోచనలోనే మునిగి తేలుతుంటారని విమర్శించారు మోదీ. ఇలాంటి వారితో నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రధాని సూచించారు.