సుమంత్ వివాదం – సీఎం పట్టుదల: తెలంగాణ దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పదవిని ప్రమాదంలో పడేసిన ప్రధాన వివాదం ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ దక్కన్ సిమెంట్ ప్రతినిధులను గన్ పెట్టి బెదిరించారన్న ఆరోపణలు. ఈ వ్యవహారంపై సుమంత్‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు కొండా సురేఖ నివాసానికి రాగా, సురేఖ కుమార్తె సుష్మిత వారిని అడ్డుకోవడమే కాక, సీఎం రేవంత్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలన్న గట్టి పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారన్న వార్తలు వచ్చాయి. తనపై, తన కుటుంబ సభ్యులపై ఒక క్యాబినెట్ మంత్రిగా ఉండి సురేఖ వ్యాఖ్యలు చేయడం తన విశ్వసనీయతపై ప్రభావం చూపుతుందని సీఎం హైకమాండ్‌తో వాదించినట్లు సమాచారం.
మొదటి కారణం: కాంగ్రెస్ బీసీ నినాదం: సీఎం రేవంత్ రెడ్డి పట్టుబట్టినా, కొండా సురేఖ పదవీ గండం నుంచి బయటపడటానికి దోహదం చేసిన మొదటి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్న బీసీ నినాదం. దేశవ్యాప్తంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు అంశాన్ని కాంగ్రెస్ బలంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో, క్యాబినెట్‌లో ఉన్న ఏకైక బీసీ మహిళా మంత్రి కొండా సురేఖను తొలగిస్తే పార్టీకి చెడ్డపేరు వస్తుందని హైకమాండ్ భావించింది. రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గమైన బీసీలకు ఇది నెగెటివ్ సంకేతాలు పంపుతుందని, ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కోక తప్పదని అధిష్టానం నిర్ణయానికి వచ్చింది. అంతేకాక, కొండా వర్గీయులు ఈ వివాదాన్ని బీసీ వర్సెస్ రెడ్ల మధ్య పోరుగా అభివర్ణించడాన్ని కూడా హైకమాండ్ పరిగణలోకి తీసుకుంది.
రెండో కారణం: కుమార్తె సుష్మిత వ్యాఖ్యలు: కొండా సురేఖను కాపాడిన రెండో ప్రధాన కారణం ఆమె కుమార్తె సుష్మిత చేసిన సంచలన వ్యాఖ్యలు. సుమంత్ బెదిరింపు వ్యవహారం సీఎం సన్నిహితుడైన రోహిన్ రెడ్డి కార్యాలయంలో జరిగిందని, ఈ వివాదంలోకి సీఎంను లాగడం ద్వారా సుష్మిత కీలక మలుపు తిప్పారు. అంతేగాక, “సీఎం సోదరులు దందాలు చేస్తున్నారని” వ్యాఖ్యానించడం, ఢిల్లీలో తన తల్లిని అవమానించారని చెప్పడం ద్వారా సీఎంను ఇరకాటంలో పడేశారు. ఈ వివాదాన్ని సాగదీసి రోహిన్ రెడ్డిపైనా విచారణ జరపాలన్న డిమాండ్ కొండా వర్గం నుంచి వస్తే అది సీఎంకు రాజకీయంగా ఇబ్బందికరంగా మారవచ్చు. అందుకే, పార్టీకి చెడ్డపేరు రాకుండా ఉండేందుకు హైకమాండ్ రంగంలోకి దిగి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ద్వారా ఈ వివాదానికి ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ పెట్టించింది.