AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేషన్ కార్డుదారులకు శుభవార్త: వైఫై ఈ-పోస్ యంత్రాలతో క్యూలైన్ల కష్టం తీరినట్టే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ పంపిణీలో సాంకేతికతను వాడుతూ రేషన్ కార్డుదారుల కష్టాలను తీరుస్తోంది. ముఖ్యంగా రేషన్ బియ్యం కోసం షాపుల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరాన్ని తగ్గించింది. ఇందులో భాగంగా, వైఫై ఆధారంగా పనిచేసే కొత్త ఈ-పోస్ (e-PoS) యంత్రాలను రేషన్ డీలర్లకు పంపిణీ చేసింది. గతంలో సెల్ సిగ్నల్స్ సాయంతో పాత యంత్రాలు పనిచేసేవి, సిగ్నల్ సమస్యల వల్ల పంపిణీ నిలిచిపోయి లబ్ధిదారులు ఎదురుచూడాల్సి వచ్చేది. ఇప్పుడు వైఫై ఆధారిత యంత్రాలు రావడంతో సిగ్నల్ సమస్యకు పూర్తిగా చెక్ పడింది, దీంతో రేషన్ సరుకుల పంపిణీ వేగవంతమై, ఆలస్యం లేకుండా జరుగుతోంది.

పాలనలో సాంకేతికతకు పెద్దపీట వేస్తున్న ఏపీ ప్రభుత్వం.. పౌర సేవలను సులభతరం చేసేందుకు ‘మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్’ మరియు ‘స్మార్ట్ రేషన్ కార్డులు’ వంటి కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే, పేదలకు అత్యంత కీలకమైన పౌర సరఫరాల శాఖలో కూడా టెక్నాలజీ వినియోగానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే ఏటీఎం కార్డు సైజులో ఉండే ‘స్మార్ట్ రేషన్ కార్డులను’ నాలుగు విడతల్లో లబ్ధిదారులకు పంపిణీ చేసింది. ఈ స్మార్ట్ కార్డు ద్వారా ఏపీ ప్రజలు రాష్ట్రంలో ఎక్కడి నుండైనా రేషన్ సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించారు. అలాగే, రేషన్ డీలర్ల ద్వారా సరుకులను పంపిణీ చేయిస్తూ, దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్దనే ఐదు రోజుల పాటు పంపిణీ చేస్తున్నారు.

కొత్తగా తీసుకువచ్చిన ఈ-పోస్ యంత్రాలలో సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేశారు. స్మార్ట్ రేషన్ కార్డులోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా కార్డుదారుని వివరాలు, ఎంత పరిమాణంలో సరుకులు ఇవ్వాలనే వివరాలు యంత్రంలో నమోదవుతాయి. ముఖ్యంగా ఈ యంత్రాలను ఫింగర్ ప్రింట్‌తో పాటు, ఫింగర్ పడకపోతే ఐరిస్ (కంటిపాప) విధానంలోనూ పనిచేసేలా డిజైన్ చేశారు. ఈ కొత్త సాంకేతికత కారణంగా రేషన్ దుకాణాల వద్ద నిరీక్షించాల్సిన పనిలేకుండా, వేగంగా సరుకులు అందుతున్నాయని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ANN TOP 10