ఓట్ల చోరీపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫిర్యాదు చేశారు. పార్టీ నాయకులతో కలిసి ఫిర్యాదు చేసిన కేటీఆర్, ఎన్నికల సంఘానికి మూడు విజ్ఞప్తులు అందజేశారు. ఓట్ల చోరీపై వెంటనే పూర్తిస్థాయి విచారణ జరగాలని, క్షేత్రస్థాయిలో కుమ్మక్కైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, నామినేషన్ ప్రక్రియ ముగిసేలోపు విచారణ పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన అనంతరం కేటీఆర్ విలేకరులతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ అక్కడ ఓట్ల చోరీ అని గగ్గోలు పెడుతున్నారని, తెలంగాణలో మాత్రం వారే దొంగ ఓట్లతో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. దొంగ ఓట్లపై ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని, విచారణ కోరినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 20 వేల వరకు దొంగ ఓట్ల కోసం ప్రణాళికలు రచించిందని ఆయన ఆరోపించారు.
నియోజకవర్గంలో ఒక ఇంట్లో 250 ఓట్లు, మరో ఇంట్లో 180, ఇంకొక ఇంట్లో 80, మరొక ఇంట్లో 90 ఓట్లు ఉన్నాయని ఆయన అన్నారు. ఒక ఇంట్లో 24 ఓట్లు ఉన్నాయని తనిఖీకి వెళ్లినప్పుడు, వారంతా ఎవరో తనకు తెలియదని ఇంటి యజమాని చెప్పారని ఆయన పేర్కొన్నారు. అక్కడకు వెళ్లి చూస్తే అవన్నీ దొంగ ఓట్లు అని తేలిందని ఆయన అన్నారు.