జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేడి ఎంతవరకు వచ్చింది? కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కానీ బీజేపీ అభ్యర్థి ఎవరన్నది తెలియలేదు. ఇంతకీ అభ్యర్థిని బీజేపీ నిలబెడుతుందా? చివరి నిమిషంలో డ్రాప్ అవుతుందా? అంటూ చర్చించుకోవడం ఆ పార్టీ నేతల వంతైంది. ఈ ఉపఎన్నికల్లో 30 నుంచి 39 ఏళ్ల వయసు గల ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నారు.
జూబ్లీహిల్స్ బైపోల్లో వారే కీలకం
అక్టోబర్ 13న అంటే సోమవారం(ఇవాళ) జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి అక్టోబర్ 21 అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చు. మరుసటి రోజు 22న నామినేషన్ల పరిశీలన జరగనుంది. 24న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. షేక్‌పేటలో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అభ్యర్థుల నామినేషన్లను అధికారులు స్వీకరించనున్నారు.
అభ్యర్థులు దరఖాస్తులను ఫారం 2బీ ద్వారా సమర్పించాలి. అలాగే అఫిడవిట్లను ఫారం 26 ద్వారా సమర్పించాల్సి ఉంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 10 వేలు సెక్యూరిటీ డిపాజిట్ సమర్పించాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రం ఉండాలి. 5 వేలు డిపాజిట్ సమర్పించాలి. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులు తప్పనిసరిగా ఆ నియోజకవర్గం ఓటరై ఉండాలి.
కీలకంగా మారిన యూత్ ఓటర్లు
ఇతర నియోజకవర్గాల అభ్యర్థులు తప్పనిసరిగా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్-ERO నుండి ఎలక్టోరల్ ఎక్స్ట్రాక్ట్ను సమర్పించాల్సి ఉంటుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా 2014 బ్యాచ్‌కు చెందిన సంజీవ్ కుమార్ లాల్‌ను భారత ఎన్నికల సంఘం నియమించింది. ఎన్నికల వ్యయ పర్యవేక్షణ ప్రక్రియను ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తారు. నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న కౌంటింగ్ జరగనుంది.
అత్యంత ప్రతిష్టాత్మకమైన జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 30 నుంచి 39 ఏళ్ల వయసు గల ఓటర్లు కీలకపాత్ర పోషించనున్నారు. నియోజకవర్గంలో దాదాపు నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో దాదాపు 97,000 మంది 30 నుంచి 39 ఏళ్లు గలవారు ఉన్నారు. ప్రతి నలుగురు ఓటర్లలో ఒకరు ఈ వయస్సువారు ఉన్నారు. వీరి శాతం 24.3 శాతంగా ఉన్నారు. నాలుగు వంతుల్లో పావువంతు వీరిదే.
20 నుంచి 29 ఏళ్ల యువ యువ ఓటర్లను పరిగణనలోకి తీసుకుంటే వారి సంఖ్య 72 వేల మంది ఉన్నారు. ఓటర్లలో వీరి సంఖ్య 18 శాతం పైనే. ఆ తర్వాత 40 నుంచి 49 ఏళ్ల వయస్సు వారు ఉన్నారు. వీరు దాదాపు 87 వేల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లలో వీరి సంఖ్య దాదాపు 21.9 శాతం అన్నమాట. 30 నుంచి 49 ఏళ్లవారి ఓటర్లు శాతం 46 శాతం అన్నమాట. ఈ ఎన్నికల్లో గెలుపోటములు తేల్చాల్సింది వీరే అన్నమాట.