తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన స్టార్‌డమ్‌కు, సినిమా హడావిడికి పూర్తిగా దూరంగా ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నారు. ప్రస్తుతం ఆయన హిమాలయాల్లో పర్యటిస్తూ ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తన ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా రజినీకాంత్ ప్రసిద్ధ మహావతార్ బాబాజీ గుహను సందర్శించారు. అక్కడ ధ్యానం చేసుకున్నారు. అంతకుముందు రిషికేశ్‌లోని స్వామి దయానంద ఆశ్రమంలో కొంత సమయం గడిపారు. అక్కడ గంగానది తీరంలో పవిత్ర హారతి కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సాధారణ భక్తుడిలా తెల్లటి దుస్తులు ధరించి, అక్కడి పూజారులతో, స్థానికులతో ముచ్చటిస్తూ కనిపించారు.
కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘అపూర్వ రాగంగళ్’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన రజినీకాంత్, దశాబ్దాల పాటు తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు గానూ పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే వంటి అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు.









