AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జగన్ పర్యటనలో డాక్టర్ సుధాకర్ ఫ్లెక్సీల కలకలం..

వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర వివాదాస్పదమైన డాక్టర్ సుధాకర్ ఉదంతాన్ని గుర్తుచేస్తూ, దళిత సంఘాలు ఆయన ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో ఈ పర్యటన చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం స్థానికంగా రాజకీయ దుమారం రేపింది.

 

జగన్ తన పర్యటనలో భాగంగా మాకవరపాలెం వద్ద నిర్మిస్తున్న మెడికల్ కళాశాలను పరిశీలించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే దళిత సంఘాల నాయకులు తమ నిరసనను వినూత్నంగా తెలియజేశారు. “మాస్క్ ఇవ్వలేక హత్యలు చేసినవాళ్లు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడటమా? ప్రజలూ.. తస్మాత్ జాగ్రత్త” అనే ఘాటు సందేశంతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలు జగన్ పర్యటించే మార్గాల్లో పలుచోట్ల వెలిశాయి.

 

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో, నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో అనస్తీషియన్‌గా పనిచేసిన డాక్టర్ సుధాకర్, వైద్య సిబ్బందికి మాస్కులు, పీపీఈ కిట్లు అందించాలని కోరారు. అయితే, ప్రభుత్వంపై విమర్శలు చేశారనే కారణంతో ఆయనను మానసికంగా వేధించారని, ఈ వేధింపులే ఆయన మరణానికి దారితీశాయని దళిత సంఘాలు చాలాకాలంగా ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు జగన్ మెడికల్ కళాశాలను సందర్శిస్తుండటంతో, అదే అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

 

ఈ ఫ్లెక్సీల ఏర్పాటుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. డాక్టర్ సుధాకర్‌కు న్యాయం చేయాలని, ఆయన మృతిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు, ఈ ఆరోపణలను వైసీపీ నాయకులు ఖండిస్తున్నారు. ఇది కేవలం రాజకీయ కుట్రలో భాగమేనని వారు కొట్టిపారేస్తున్నారు. ఏదేమైనా, జగన్ పర్యటన సమయంలో ఈ ఫ్లెక్సీలు ప్రత్యక్షమవడం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది.

ANN TOP 10