AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జక్కన మాస్టర్ ప్లాన్..! జేమ్స్ కామెరూన్ చేతులు మీదగా SSMB29 రిలీజ్..?

సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న పాన్-వరల్డ్ సినిమా గురించి ఒక సెన్సేషనల్ అప్డేట్ బయటకు వచ్చింది. ఇప్పటివరకు అత్యంత రహస్యంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ ను హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు రాజమౌళి భారీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

 

వివరాల్లోకి వెళితే… ప్రముఖ హాలీవుడ్ సినిమా ‘అవతార్: ద ఫైర్ అండ్ యాష్’ ప్రమోషన్స్ కోసం జేమ్స్ కామెరూన్ నవంబర్ నెలలో భారత్ కు రానున్నారు. ఇదే సరైన సమయమని భావించిన రాజమౌళి, ఆయనతో తన సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న జక్కన్న, ఇప్పుడు తన తర్వాతి సినిమా అప్డేట్ ను కూడా అదే స్థాయిలో ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు.

 

మరోవైపు ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి ‘వారణాసి’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న సినిమాకు భారతీయ నగరం పేరు పెట్టడం ఏంటని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే, వారణాసి నగరానికి చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. కథకు కీలకమైన అంశం కావడంతోనే రాజమౌళి ఈ పేరును ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

 

ఈ గ్లోబ్-ట్రాటింగ్ అడ్వెంచర్ సినిమాలో బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వెళ్లిన స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ANN TOP 10