మరికాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ రైలు ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు పీఎం హాజరవుతారు. అక్కడే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. అయితే, ఈ కార్యక్రమాలకు హాజరు కావాలంటూ సీఎం కేసీఆర్‌ను పీఎంఓ ఆహ్వానించింది. కానీ, పీఎం మోదీతో వేదిక పంచుకునేందుకు ససేమిరా అంటున్నారు సీఎం కేసీఆర్. ఇక బేగంపేట విమానాశ్రయంలో ప్రధానిని రిసీవ్ చేసుకునేందుకు ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ వెళ్లబోతున్నారు.
ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా ఉన్న సీఎం కేసీఆర్‌కు ట్విస్ట్ ఇచ్చేందుకు సిద్ధమైంది బీజేపీ. ఇందులో భాగంగా ఆయనను రాజకీయంగా ఇరకాటంలో పెట్టే ఉద్దేశ్యంతో పరేడ్ గ్రౌండ్స్ సభా వేదికపై కేసీఆర్ కోసం ఆసనం ఏర్పాటు చేస్తోంది. కే. చంద్రశేఖరరావు, చీఫ్ మినిస్టర్ అంటూ రిజర్వ్డ్ సీట్ ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ సీటుకు ఎడమవైపున కేసీఆర్ సీటు ఏర్పాటు చేశారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కోసం సీటు కేటాయించారు. ప్రోటోకాల్ ప్రకారం అధికారులు సీట్లు ఏర్పాటు చేశారు. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే.. ఇదే వేదికపై ప్రోటోకాల్ ప్రకారం మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డికీ కూడా సీటు వేశారు. అయితే, ఇప్పటికే ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్ రారంటూ తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. ఇంతలో ఈ ఆసనం దర్శనం ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇలా సీటు వేయడం ద్వారా.. కేసీఆర్ రాలేదు అని పదేపదే చెప్పే వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.