AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘ప్రాజెక్టు చీతా’ మరో కీలక దశ..! ఆఫ్రికా దేశాల నుంచి భారత్‌కు మరికొన్ని చీతాలు..

దేశంలో చిరుతల పునరావాసానికి చేపట్టిన ‘ప్రాజెక్టు చీతా’ మరో కీలక దశలోకి ప్రవేశిస్తోంది. చిరుతల సంఖ్యను మరింతగా పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో ఎనిమిది చీతాలను భారత్‌కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందులో నాలుగు చీతాలను నమీబియా నుంచి, మరో నాలుగు చీతాలను బోట్స్‌వానా నుంచి తీసుకురానున్నట్లు అటవీశాఖ వర్గాలు తెలిపాయి.

 

ఈ చిరుతలను ఈ ఏడాది చివరినాటికి మధ్యప్రదేశ్‌లోని గాంధీ సాగర్ అభయారణ్యంలో వదిలే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు దక్షిణాఫ్రికా, కెన్యా బృందాలు అక్కడి వాతావరణం, జీవ వైవిధ్యాన్ని అధ్యయనం చేశాయి.

 

ఆహారం కోసం చిన్న జంతువుల అభివృద్ధి

 

చిరుతలకు తగిన ఆహారం అందించేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. జింకలు, కుందేళ్లు, అడవి కుక్కలు, ఇతర చిన్న వన్యప్రాణులను అభయారణ్యంలో ప్రవేశపెడుతున్నారు. ఇది చిరుతల వేట సామర్థ్యాన్ని పెంచడమే కాక, వాటి జీవన విధానానికి అనుగుణంగా ఉంటుందని అధికారులు చెప్పారు.

 

కునో నేషనల్ పార్క్‌లోని అనుభవాలే పాఠాలుగా

 

‘ప్రాజెక్టు చీతా’లో భాగంగా తొలుత కునో నేషనల్ పార్క్‌ (మధ్యప్రదేశ్‌)లోకి 20 చీతాలను తెచ్చారు. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించక వాటిలో 9 చీతాలు మృతి చెందాయి. మిగిలినవి ఇప్పటికీ సజీవంగా ఉండగా, కొన్ని చిరుతలు పిల్లల్ని కనడం సానుకూల సూచనగా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 27 చీతాలు ఉన్నట్లు అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి.

 

రాజస్థాన్ సరిహద్దులో గాంధీ సాగర్ అభయారణ్యం

 

గాంధీ సాగర్ అభయారణ్యం రాజస్థాన్ సరిహద్దులో ఉంది. ఇది చిరుతల పునరావాసానికి అనువైన వాతావరణం కలిగి ఉందని, దీనిని రెండవ ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ANN TOP 10