AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీక్రెట్ గా దేవరకొండ-రష్మిక నిశ్చితార్థం..? పెళ్లి ఎప్పుడంటే..?

టాలీవుడ్‌లో ఎప్పటినుంచో చక్కర్లు కొడుతున్న ప్రేమ ప్రచారానికి యంగ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న తెరదించారు. తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే కాదని స్పష్టం చేస్తూ, ఈ జంట ఒకరికొకరు ఉంగరాలు మార్చుకున్నారు. దసరా పండుగను పురస్కరించుకుని అత్యంత రహస్యంగా, కేవలం ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థ వేడుక జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

 

‘గీత గోవిందం’ సినిమాతో వెండితెరపై మ్యాజిక్ చేసిన ఈ జంట, ఆ సినిమా షూటింగ్ సమయంలోనే మంచి స్నేహితులయ్యారు. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’తో వీరి మధ్య బంధం మరింత బలపడి ప్రేమగా మారింది. అప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. విహారయాత్రలకు కలిసి వెళ్లడం, ఒకే రకమైన దుస్తుల్లో కనిపించడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అయితే, తమ రిలేషన్‌షిప్‌పై వస్తున్న వార్తలపై ఇద్దరూ ఎప్పుడూ నేరుగా స్పందించలేదు. మీడియా ప్రశ్నలకు చాలా తెలివిగా సమాధానం ఇస్తూ వచ్చారు.

 

అయితే, ఇటీవల పరోక్షంగా తమ బంధంపై సంకేతాలిస్తున్న ఈ జంట, ఇప్పుడు ఏకంగా నిశ్చితార్థంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇరు కుటుంబాల పూర్తి అంగీకారంతో ఈ వేడుకను చాలా ప్రైవేట్‌గా నిర్వహించారు. వచ్చే ఏడాది వీరి వివాహాన్ని ఘనంగా జరిపించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ శుభవార్తను విజయ్, రష్మిక అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

 

ఇక కెరీర్ పరంగా కూడా ఇద్దరూ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘పుష్ప 2’, ‘ఛావా’ చిత్రాలతో రష్మిక భారీ విజయాలు అందుకోగా, విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్’ సినిమా కూడా ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించింది. ఇప్పుడు వీరిద్దరూ వ్యక్తిగత జీవితంలోనూ ఒక్కటి కాబోతుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ANN TOP 10